కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు?
కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది.
1. ఉపవాసము 2 ఏకభక్తము 3 నక్తము 4 అయాచితము 5.స్నానము 6.తిలదానము
1.ఉపవాసము: శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్ధము మాత్రమే సేవించాలి.
2 ఏకభక్తము: సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికొని - మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ తీర్ధమో మాత్రమే తీసుకోవాలి.

3.నక్తము: పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.
4 అయాచితము: భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా - వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము"
5.స్నానము:పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.
6. తిలదానము: మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.
పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారము నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ - ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.
సోమవార వ్రతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి.












Click it and Unblock the Notifications