వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓంకారంతో దివ్య ప్రకంపనలు.. తరంగాలతో దేహం పులకితమయం!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే! ఓంకారం దేహంలో ఉంది. 'ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది. ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.

'ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి'అంటారు. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. 'అ'కార, 'ఉ'కార, 'మ'కారాలు కలిసి 'ఓంకారం' అయిందని పండితులు చెబుతారు. ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు- అంటారు యోగ నిపుణులు.

 Importance of Omkaram: Magic of Pranamayam

వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ,ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది. నిశ్శబ్దానికి నేపథ్యంగా ఉండేది ఓంకారమే. అది విశ్వంలో ఆత్మగా ఉంది. ఓంకారం- పిలిస్తే పలుకుతుంది. ఋషుల చుట్టూ తిరుగుతుంది. ధ్యానుల శరీరాల్ని డమరుకాలు చేస్తుంది. జ్ఞానుల దేహాల్ని పాంచజన్యాలుగా మారుస్తుంది. శ్రీకృష్ణుడి మురళిలోకి ప్రవేశించిన ఓంకారం బృందావనమంతా విహరించిందని పురాణ గాథలు చెబుతాయి.

ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే. శివుడి మాటలకు భాష ఓంకారం. ఆ శివతాండంలో ఓంకారం ప్రణవ నాదమవుతుంది. ముల్లోకాలూ ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారమే ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ఓంకారాన్ని ఆహ్వానించి, ఆవాహన చేసుకున్న మానవ జన్మ ధన్యమైనట్లే.

ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఇలా ప్రతి నామం ముందూ ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది.'ఓం' అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్లే. సకల జీవులూ ఓం తోటలో పూచిన పుష్పాలు. ఓంకార వర్షంతోనే అవి పెరుగుతాయి. ఓంకార కాంతిలోనే అవి హాయిగా జీవిస్తాయి. ఓంకారం వాటికి ప్రాణవాయువు. వాటికి శక్తి,ధైర్యం, శాంతి ఓంకారమే. అందుకే అందరూ 'ఓం'కారాన్ని శాంతితో జతచేస్తారు. శాంతిలో 'ఓం' చూస్తారు.

'సమస్తం ఓంకారం నుంచే ఉద్భవించింది' అంటారు కబీర్‌. దైవం ఓంకార ప్రేమ స్వరూపం. ఆయన రూప రహితుడు, నాశన రహితుడు, నిర్గుణుడు. ఆయనతో ఐక్యం కావడానికి ప్రయత్నించు. సమస్తమూ ఆయన ఆనందంలోనే ఉంది' అని చాటిన కబీర్‌ మాటలు అక్షర సత్యాలు.

English summary
Omkaram is the powerful word for Physical and mental energy. Pronouncing the word give immense pleasure to human body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X