• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహారాధన నిగ్రహము కొరకే..అంతరార్థం ఏంటి..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. అనంత భక్తి, జ్ఞాన తత్త్వం.. భావగర్భితంగా.. ఏక వాక్యంగా ఇందులో చెప్పబడింది. దైవం తత్త్వరూపంలో వున్నదని, ఆ తత్త్వరూపంలో వున్నచైతన్యానికి శిలావిగ్రహం అనేది ఒక ప్రతీక మాత్రమేనని చెప్పడం, ఆ తత్వాన్నే చూసినప్పుడు విగ్రహం కనిపించదని, కేవలం దైవమే గోచరిస్తుందని, అలాంటి దైవత్వాన్ని అంతటా చూడగలిగినప్పుడు ఆ భక్తునికిక దేహభావం కూడా వుండదని, అంతా పరమాత్మ స్వరూపంగానే భాసిస్తుందని చెప్పడం ఇందులోని అంతరార్థం.

అనగనగా ఒకానొక ఊరిలో ఒక పురాతనమైన ఆలయానికి ఒక తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి వెళ్తారు. ఆలయంలోకి వెళ్ళగానే ఆ ప్రక్కనే వున్న బావి నుంచి ఒక బొక్కెన నీళ్ళను తొడుకుని చక్కగా ముఖము కాళ్ళు చేతులు శుచిగా కడుక్కుని నారాయణ స్మరణ చేస్తూ నెత్తిపై నీళ్ళను చల్లుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేసిన అనంతరం అంతరాలయంలోకి ప్రవేశించి తనవి తీరా దైవ దర్శనం చేసుకిని.. అన్నీ పూర్తయ్యాక గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని తీరికగా ఒక చోట కూర్చుని తినేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లోని కళ్యాణ మండపం వద్దకు రాగా అక్కడ మెట్లకు ప్రక్కనున్న రాతి సింహం విగ్రహాలను చూసి భయంతో కొడుకు తండ్రిని గట్టిగా పట్టుకుంటాడు.

Why do one worship idols, what benefits he or she-reason here

ఆ ఐదారేళ్ళ తుంటరి పసివాడు. అప్పుడు తండ్రి ఆప్యాయతతో ఆ బిడ్డడిని చేతిలోకి తీసుకుంటూ వీపు తడుతూ చిరునవ్వుతో ప్రియంగా అవి రాతి బొమ్మలు కన్నా నిజమైన సింహాలు కావవి, వట్టి బొమ్మలు అంతే అవీ నిన్ను ఏమీ చేయలేవు అని అంటాడు. అప్పుడా పసివాడు అలా అయితే మరి గుడిలో దేవుడో? ఆయన కూడా అంతేనా అంటూ తనదైన సహజమైన అమాయకత్వంతో ప్రశ్నిస్తాడు. అప్పటిదాకా 'విగ్రహరూపంలో వున్న ఆ దేవదేవునికి' ఎన్నో కోరికలను మొరపెట్టుకున్న ఆ తండ్రికి తన బిడ్డనోట 'దేవుని అస్తిత్వాన్ని' ప్రశ్నించే స్థాయిలో మాట వినబడగానే ఒక్క క్షణం మౌనపడి, ఆ పసివాడికి అర్థం అయ్యేలా ఎలా చెప్పాలా అని ఆలోచించసాగాడు ఆ తండ్రి.

ఇది ఒక అసంపూర్ణ కథగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఈ కథ ఎప్పుడో పూర్తి అయ్యింది. అది వ్యక్తుల నిశ్చయజ్ఞానాన్ని బట్టి వివిధ స్థాయీ భేదాలతో బోధ పడుతూ వుంటుంది. ఒక రాతి విగ్రహం భయంగొలిపేదిగా వుంటే మరొక రాతి విగ్రహం అభయాన్ని ఎలా ఇస్తుంది? ఈ ప్రశ్న వచ్చాక విచారణకు ఆస్కారము, అవసరము ఏర్పడుతున్నది. అలా విచారణ చేసినప్పుడు 'విగ్రహం నిగ్రహము కొరకే' వంటి వాక్యాల యందు దాగివున్న పరమార్థం బోధపడుతుంది. నిజానికి ఇక్కడ దేవాలయాలలో జరుగుతున్నది విగ్రహారాధన కాదు, అది ఈశ్వరారాధన.

అనంతంగా, అఖండంగా, అవ్యయంగా అంతా తానై, తాను తప్ప తక్కినది లేకుండగా రెండవది లేనట్టి ఒక్కటిగా, నిరాధారంగా, నిరంజనంగా, నిర్మలంగా, నిత్యంగా, నిరాకారంగా, నిర్గుణంగా, నిష్కళగా, శాంతంగా, నిత్యముక్తంగా, నిర్వికారంగా, నిష్ప్రపంచంగా, నిరాశ్రయంగా, నిత్యశుద్ధంగా, నిత్యబుద్ధంగా, నిరంతరంగా, నిష్క్రియంగా, నిరవయవంగా, నిరామయంగా వున్న పరమాత్మ తత్వాన్ని మనసుకి తెచ్చుకోవాలంటే ఎంతో సునిశిత బుద్ధి అవసరం కనుక, జన సామాన్యానికి అంతటి బుద్ధి సూక్ష్మత ఎల్లవేళలా కలిగేందుకు అవకాశం వుండదు కనుక ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్నిసాకార సగుణ తత్త్వంగా నామరూపాత్మకంగా ఒక విగ్రహరూపంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్య ఆరాధన జరిగేలా పెద్దలు ఒక సాంప్రదాయాన్ని రూపొందించడం జరుగగా అది మన సనాతన ధర్మంలో భాగమైపోయింది.

ఒక సంప్రదాయం వెనుక నున్న పరమార్థాన్ని గ్రహించకుండా చేసే ఆచరణ అనేది మిథ్యాచారానికి తీసుకెళ్తుంది. అప్పుడు మన పెద్దలు ఏ ఉద్దేశ్యం చేత ఇలా చేయి, అలా చేయమని చెప్పారో ఆ ఉద్దేశ్యం నెరవేరదు. అంచేత ప్రతీకాత్మకంగా మన సంస్కృతిలో భాగమైన వివిధ రకాలైన విధి విధానాల వెనుక వున్న అంతరార్థాన్ని పూజ్యులైన పెద్దల వద్ద క్షుణ్ణంగా గ్రహించి, భావితరాలవారికి అందించాల్సిన బాధ్యత, నేటి తరంపై ఎంతగానో వున్నది.

సుగుణం:- భగవంతుడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు కనుకనే ప్రతివారికీ ఏదో ఒక సుగుణాన్ని ప్రసాదించి తద్వారా వారికి ఎనలేని కీర్తి కలిగేలా దీవిస్తాడు. ఉదాహరణకు రాక్షసులకు ఉన్నంత దీక్ష, పట్టుదల దేవతలలో కనిపించవు. అందుకే దేవతలు రాక్షసుల ముందు తలవంచ వలసి వచ్చేది. తామనుకున్న కార్యం సాధించే వరకూ సకల దుఃఖాలనూ చివరకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తపస్సు చేసి, అసాధారణ వరాలు పొందగలిగిన రాక్షసులు తమకున్న ఓర్పు, పట్టుదల అనే సుగుణాలతో దైవాన్ని కూడా వశపరచుకోగలిగారు.

మహాబలి దాతృత్వం ముందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే వామనుడై చేయి సాచాడు. పది తలల రావణాసురుని భక్తి ముందు కైలాసనాథుడే ఆత్మలింగమై చేతికి చిక్కాడు. దుర్యోదనుని స్నేహధర్మం ముందు అతడెంత దుర్మార్గుడైనా, శ్రీకృష్ణుడంతటి వాడిని కూడా నిర్లక్ష్యం చేసి, తన సర్వస్వాన్ని అతని పాదాక్రాంతం చేశాడు కర్ణుడు. వీరంతా ఎంతటి కర్కోటకులైనా, లోకకంటకులైనా, వారిలోని ఒక్క మంచి గుణంతో చరిత్రలో శాశ్వత కీర్తిని పొందగలిగారు.

English summary
Why one worships the idols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X