హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు వైయస్ పాఠాలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: 'గత ప్రభుత్వంలో 14 మంది మంత్రులు ఓడిపోయారు. దీన్ని నిశితంగా పరిశీలించండి. అలాంటి లోపాలు లేకుండా 294 నియోజక వర్గాల్లో ప్రజలు హర్షించే విధంగా చూసుకోవాలి' అని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు సూచించారని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైయస్ అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశం సోమవారం రాత్రి జరిగింది. మంత్రుల జాబితాకు సోనియా గాంధీ ఆమోదం తీసుకునేందుకు వెళ్లినపుడు ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. "గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోయినా సహించాను. ఈసారి అలా కుదరదు. ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు హాజరు కాకపోయినా, ఆలస్యంగా వచ్చినా సహించేది లేదు. ఇలా చేసేవారి నుంచి రాజీనామాలేఖ కోరుతూ నా పేషీ నుంచి ఆదేశాలు వస్తాయి. రాజీనామా చేశాక మంత్రులు తీరిగ్గా సొంత పనులు చూసుకోవచ్చు" అని ముఖ్యమంత్రి హెచ్చరిక చేసినట్లు మంత్రి రోశయ్య మీడియా సమావేశంలో వివరించారు. ఉదయం 8.30 గంటల కల్లా మంత్రులు సభలో ఉండాలని చెప్పారు. గతంలో వివిధ ప్రాజెక్టులు, పథకాలకు శంకుస్థాపనలు చేశామని, ఇప్పుడు వాటిని పూర్తి చేసి పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకోవాలన్నారు. మంత్రులు, వారి శాఖల పనితీరును ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తానని చెప్పారు.

జూన్‌ 3 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, వీలును బట్టి అయిదు నుంచి ఏడు రోజులపాటు సమావేశాలు ఉండొచ్చని చెప్పారు. కొందరు మంత్రులను తప్పించటంపై విలేకర్లు ప్రశ్నించగా మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టమని, దానికి అదిష్ఠానం ఆమోద ముద్ర వుంటుందని, దానిపై వ్యాఖ్యానించేందుకు అవకాశం ఉండదని రోశయ్య తెలిపారు. అవకాశం రానివారి సేవలను వేరే రూపంలో వినియోగించుకుంటామన్నారు. ప్రభుత్వ పదవులే కాదు, పార్టీని పటిష్ఠం చేయడం కూడా ముఖ్యమేనని చెప్పారు. మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్లినపుడు పార్టీ కార్యాలయాలను సందర్శించాలని, ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పటికీ ఆ సమయంలో ఇన్‌ ఛార్జిగా ఎవరినీ నియమించాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు, తెల్లకార్డులపై ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దుమ్ముగూడెం టెయిల్‌ పాండ్‌, పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అధికారులు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై భారం తగ్గిపోయి, మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు, ఇప్పటివరకు అయిన ఖర్చు, సాగులోకి వచ్చిన ఆయకట్లు వివరాలను సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శులు మంత్రులకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలును మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్లినపుడు సమీక్షించాలని, లోపాలు ఉంటే సరిదిద్దాలని చెప్పారు. మంత్రులు పారదర్శకంగా ఉండాలని, పరిపాలనా వ్యవహారాలు కూడా పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. తమ శాఖల లక్ష్యాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. శాసనసభ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను మంత్రులు ముందుగానే ఆలోచించి, పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. మంత్రులు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, మంత్రుల మీద ఎవరైన పొరపాటు మాట్లాడినా ఆదే రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను పత్రికా విలేకర్ల చెప్పవద్దని ముఖ్యమంత్రి మంత్రులను హెచ్చరించారని తెలిసింది. ప్రభుత్వ రహస్యాలను కాపాడతామని ప్రమాణం చేసినందున అందుకు కట్టుబడి ఉండాలని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X