తెలంగాణ పరువు పోతుందనే కెసిఆర్ గురించి చెప్పడం లేదు: ఎర్రబెల్లి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ పరువు పోతోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తతంగాన్ని బయట పెట్టడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కెసిఆర్ అంటే తనకు వ్యతిరేకత లేదని అయితే ఆయన చేసిన తప్పుల్ని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ఉద్యమాలను టిఆర్ఎస్ తమ పార్టీ జెండాతో చేస్తున్నప్పుటు తెలుగుదేశం పార్టీ తమ జెండాతో ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఏ ఆందోళన చేసినా టిడిపి జెండాతోనే చేస్తామని చెప్పారు. పరిగిలో హరీశ్వర్ రెడ్డి నిర్వహించే సభకు తాము వ్యతిరేకం కాదన్నారు. హరీశ్వర్ రెడ్డి విషయంపై త్వరలో చర్చిస్తామని చెప్పారు.
ఈ నెల 23 నుండి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. పాదయాత్రకు చంద్రబాబును కూడా ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో జెఏసి తరఫున పోటీ చేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. అందరూ జెండాలు పక్కన పెట్టి కేవలం తెలంగాణ అజెండాతో మాత్రమే ఎన్నికలలో పోటీకి దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలకు దూరంగా ఉండటానికి కూడా తాము సిద్ధమని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీని కేవలం కొందరు కుట్ర పూరితంగా ఉస్మానియా జెఏసిలో వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణపై స్పష్టత ఉందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అయినప్పటికీ తెలంగాణపై ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.