మహబూబ్‌నగర్: తెలంగాణ కోసం తాను చేపట్టిన పాదయాత్రను మంత్రి డికె అరుణ తన నియోజకవర్గం అయిన గద్వాల్‌లో అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని పాదయాత్ర చేపడుతున్న జూపల్లి కృష్ణారావు ఆదివారం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్పందించి డికె అరుణకు నచ్చజెప్పి తన పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. తాను ఆధిపత్యం కోసం పాదయాత్ర చేస్తున్నానన్న డికె అరుణ వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. తాను ప్రత్యేక తెలంగాణ సాధన కోసమే యాత్ర చేస్తున్నానని చెప్పారు.
పాదయాత్రలో తన స్వప్రయోజం ఏమీ లేదన్నారు. పాదయాత్రపై ఇన్నాళ్లూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. తన పాదయాత్రపై అవసరమైతే జిల్లా నేతలతో చర్చిస్తానని చెప్పారు. కాగా పెబ్బేరు జైలులో ఉన్న జూపల్లి బెయిలు తీసుకోవడానికి నిరాకరించారు. పాదయాత్ర చేస్తున్న మంత్రిని శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా స్టేషన్‌లోనే ఉన్నారు. ఈ సాయంత్రం జెఏసి నేతలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు.