హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయగానే సీమాంధ్రలో ఉద్యమం రగులుకుంది. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంపై సమైక్యాంధ్ర పోరాట సమితి సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలతో అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. రాజీనామాలు చేసి బెదిరించి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం కోసం రాజీనామా చేసిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వారిని ప్రజాప్రతినిధులుగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామా హెచ్చరికలతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.