హైదరాబాద/వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పలువురి ఇళ్లపై తెలంగాణవాదులు మంగళవారం దాడులు చేశారు. కాంగ్రెసు పార్టీకి చెందిన మల్కాజిగిరి శాసనసభ్యుడు ఆకుల రాజేందర్ రాజీనామా చేయక పోవడంతో మంగళవారం ఉదయం తెలంగాణవాదులు మల్కాజిగిరిలోని ఆయన ఇంటిని ముట్టడించారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాగా ఆకుల రాజేందర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.
వరంగల్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. రాజీనామా కోసం డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. గుండు సుధారాణి రాజీనామా చేయక పోవడంతో తెలంగాణవాదులు ఆమె ఆస్తులపై దాడులు చేస్తారేమోనన్న అనుమానంతో ఆమెకు సంబంధించిన పెట్రోలు బంకు, హోటలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి ఇంటిని సైతం తెలంగాణవాదులు ముట్టడించి రాజీనామాకు డిమాండ్ చేశారు.