న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై చాలా కాలంగా తీవ్రమైన విమర్శలను ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. తెలంగాణ ఉచ్చు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మెడకు చుట్టుకుని, ఆయనకు ఊరటనిచ్చింది. కాంగ్రెసు పార్టీ తీవ్రమైన చిక్కుల్లో పడింది. కాంగ్రెసు తెలంగాణ నేతలు పార్టీ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకోవడం, తెలంగాణ విషయంలో సోనియాను దోషిగా నిలబెట్టే పరిస్థితి రావడం చంద్రబాబుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికే చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారని అంటున్నారు. చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన నాగం జనార్దన్ రెడ్డి విమర్శలు చేసినట్లుగానే, ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణ నేతలు తమ పార్టీ అధిష్టానంపై విరుచుకుపడే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కరీంనగర్‌లో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.
తెలుగుదేశం సీమాంధ్ర నాయకుల్లో విజయవాడకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు తప్ప ఎవరు కూడా తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇప్పుడిప్పుడే సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు నోరెత్తుతున్నారు. కాంగ్రెసు ఎలా బయటపడుతుందో చూడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీమాంధ్ర నాయకులను సైలెంట్ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు నాయకులతో పాటు నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటి వరకు చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ మనుగడను తెలంగాణ ప్రాంతంలో తుడిచిపెట్టడానికి వ్యూహాత్మకంగా కదిలారు. దానికి విరుగుడుగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను చంద్రబాబు ముందుకు తెచ్చారు.
తెలంగాణ విషయంపై చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడడం లేదు. కాంగ్రెసు అధిష్టానం బయటపడితే చూద్దామని వేచి చూసే ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దాని నుంచి బయటపడడం సులభం కాదని కూడా ఆయన భావిస్తున్నారని అంటున్నారు. బంతి మొత్తం మీద కాంగ్రెసు అధిష్టానం కోర్టులో ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశమనే చెప్పాలి.