విశాఖపట్నం: తనపై వచ్చిన ఆరోపణలు నిజమైనవని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం శాసనసభ్యుడు కన్నబాబు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల భూములు అయినా, ప్రభుత్వ భూములు అయినా తాను పదవిని అడ్డు పెట్టుకొని లాక్కున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. కాగా విశాఖలోని మధురవాడలో స్వతంత్ర్య సమరయోధుల భూములను పదవి అడ్డు పెట్టుకొని తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
కమ్యూనిస్టు పార్టీలు ఆయనపై ఉద్యమం సైతం చేపట్టింది. కన్నబాబు ఆక్రమించుకున్న బూములను అర్హులైన వారికి ఇచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సుమారు ఎకరం 12 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను చాలా ఆయన ఆక్రమించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. భూములను పేదలకు పంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.