విజయమ్మ తర్వాత రెండో ఎమ్మెల్యే: వైయస్సార్ కాంగ్రెస్
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని రెండో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపడం తమ జిల్లాకు దక్కిన వరంలా భావిస్తామని ఆ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి శనివారం చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. అక్కడ నల్లపురెడ్డి విజయం నల్లేరు మీద నడకలాంటిందన్నారు. కొవ్వూరు ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజానాడికి దర్పణం పట్టనున్నాయన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్ని కుయుక్తులు పన్నినా తమ విజయం అడ్డుకోలేరన్నారు.
కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలే అక్కడ పునరావృతమవుతాయని చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానం ధాటికి కాంగ్రెసు, టిడిపిలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేవన్నారు. నల్లపురెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు.