హైదరాబాద్: ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఆలోచించవలసిన పని లేదని ఇక నుండి జనంలో ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వర్గం ఎమ్మెల్యేలకు శనివారం సూచించారు. శనివారం అనర్హత వేటు పడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, సుచరిత, చెన్నకేశవ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆయనను కలిశారు. ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా మనం భయపడాల్సిన పని లేదని వారితో జగన్ చెప్పారు. మనం ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాం కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అనుకూలంగా ఉన్న ప్రజలను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో మనం నిమగ్నమై ఉండాలని సూచించారు. నన్ను కూడా మీరు కలవాల్సిన పని లేదని నేనే మీ నియోజకవర్గాలకు వచ్చి కలుస్తానని చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సర్కారు వైఫల్యాలను ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉండాలని సూచించారు.
కాగా అనర్హత వేటు పడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే తమ తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. పలువురు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రజలను కలవటం ప్రారంభించారు. తమ తమ వర్గం నేతలతో భేటీ అవుతూ ఉప ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కాగా జగన్ కూడా ముఖ్య నేతలు, ఆయా నియోజకవర్గ నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.