ఎసిబి విచారణ: నో కామెంట్ అన్న జగన్ పార్టీ ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Oneindia Telugu
Chennakeshava Reddy
కర్నూలు/వరంగల్: ఎమ్మిగనూరు శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెన్నకేశవ రెడ్డి మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ల కేసులో లంచం తీసుకున్నట్లు చెన్నకేశవ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎసిబి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

మద్యం సిండికేట్ల నుండి నెలకు నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి విచారణలో చెన్నకేశవ రెడ్డి ముడుపులు తీసుకున్నట్లుగా బయటపడిందని తెలుస్తోంది. అందువల్లే ఆయనను విచారించారు. చెన్నకేశవ రెడ్డి ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

ఎసిబి అధికారులు ఆయనను కర్నూలు జిల్లాలోని ఎసిబి కార్యాలయంలో సుమారు గంటన్నరకు పైగా విచారించారు. విచారణ అనంతరం ఆయనను మీడియా పలకరించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. విచారణ ఎలా జరిగిందో ఎసిబినే అడగండంటూ చెబుతూ వెళ్లిపోయారు. చెన్నకేశవ రెడ్డిని ఎసిబి జెడి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఎసిబి అధికారులు వరంగల్ జిల్లా కార్యాలయంలో ప్రశ్నించారు. ఎసిబి జెడి, డిఎస్బీలు ఎమ్మెల్యేను ముడుపుల వ్యవహారంపై ప్రశ్నించారు. అనంతరం సండ్ర వీరయ్య మాట్లాడుతూ.. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటానని చెప్పారు.

మద్యం ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రజాప్రతినిధులకు ఎసిబి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 18 నుండి 20వ తారీఖు మధ్యన తమ ఎదుట హాజరు కావాలని ఎసిబి వారిని ఆదేశించింది. దీంతో సోమవారం నుండి ప్రజాప్రతినిధులు క్యూ కడుతున్నారు. సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు కూడా ఎసిబి ముందు హాజరు కానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yemmiganuru YSR Congress party MLA Chennakeshava Reddy did not like to respond on his ACB enquiry. He attended before ACB on Tuesday in Kurnool district.
Please Wait while comments are loading...