• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నీయబ్బ సొత్తా, కెసిఆర్ కడుపున...: కెటిఆర్‌పై కెకె ఫైర్

By Srinivas
|

KK Mahender Reddy
కరీంనగర్: సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత కార్మికుల కోసం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కెకె మహేందర్ రెడ్డి తెరాస, కెటిఆర్ పైన తీవ్రస్థాయిలో మండి పడ్డారు.

కెటిఆర్ తాటాకు చప్పుళ్లకు తాము బయపడే సమస్య లేదన్నారు. ఆయన తీరు ఇలాగే ఉంటే సిద్దిపేట పొలిమేర దాకా సిరిసిల్ల ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. ఆయనను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. తాను తెలంగాణ గడ్డ పైనే పుట్టానని, పచ్చి తెలంగాణవాదినని, అయితే ప్రజా సమస్యలకు తెలంగాణవాదానికి ముడిపెట్ట వద్దన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర కోరికను గౌరవిస్తామని జగన్ ఎప్పుడో చెప్పారన్నారు.

కేంద్రం తెలంగాణ ఇస్తే తాము అడ్డుకోబోమని చెప్పారని, ఇంకా వైయస్సార్ కాంగ్రెసును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోలేదని ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పడానికి ప్రజల నుండి విజయమ్మకు వస్తున్న ఆదరణే నిదర్శనమన్నారు. ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా దివంగత వైయస్‌ను అభిమానిస్తున్న వారున్నారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి గుడిసెకు చేరుకున్నాయన్నారు.

అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను టార్గెట్ చేశాయని, ఇప్పుడు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు తన ప్రభావం చూపుతుందని భావించిన టిఆర్ఎస్... విజయమ్మ మహిళ అని కూడా చూడకుండా గుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడులు చేశారని మండిపడ్డారు. మహిళను కించపర్చడం తెలంగాణ సంస్కృతి కాదని, కానీ టిఆర్ఎస్ మాత్రం మన సంస్కృతికి భిన్నంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తల్లిలాంటి విజయమ్మను అడ్డుకోవడం సరికాదన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించినందు వల్లే జగన్ గతంలో జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేయలేదన్నారు. కెటిఆర్ ఆటవిక రాజ్యాన్ని ప్రోత్సహించ వద్దని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు వస్తే తమ రాజకీయ ఉనికి కోల్పోతామని భావించి టిఆర్ఎస్ విజయమ్మను అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. సిరిసిల్లలో తమ సత్తా చూపించేందుకే నిన్నటి వరకు టిఆర్ఎస్ ఎంత చేసినా ఓపిక పట్టామన్నారు.

ఇప్పుడు సభ నిర్వహణ ద్వారా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తా తెలిసిందన్నారు. చేనేత కార్మికల కోసం విజయమ్మ దీక్ష చేస్తున్నారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదన్నారు. కానీ టిఆర్ఎస్సే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందన్నారు. ఈ సభ ద్వారా వైయస్ అభిమానులు, జగన్ అనునయులు తెలంగాణలో చాలామంది ఉన్నారని నిరూపించామన్నారు.

కెటిఆర్ చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. కెటిఆర్‌కు సిరిసిల్లలో స్థానం లేదన్నారు. తాను సిరిసిల్ల వాడినేనని, తాను చస్తే ఇక్కడే పూడ్చుతారని, కానీ కెటిఆర్ ఎప్పటికైనా కరీంనగర్‌కో, హైదరాబాదుకో వెళ్లి పోవాల్సిందే అన్నారు. కెటిఆర్ అనవసర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా, ఏ నేతకైనా ఏ ప్రాంతానికి అయినా వచ్చే హక్కు ఉందన్నారు.

తెలంగాణ నీ అబ్బ సొత్తు కాదని, మా అందరి సొత్తు అని కెకె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేం పుట్టిందే తెలంగాణలో అన్నారు. కెటిఆర్ కళ్లు తెరవక ముందే తాము తెలంగాణవాదం వినిపించామని మండిపడ్డారు. చీమలు పెట్టిన పుట్టలలో పాములు ఉన్నట్లుగా.. ఎక్కడో అమెరికాలో ఉండే కెటిఆర్ రాజకీయాల కోసం తెలంగాణ పేరు చెప్పుకొని ఇక్కడకు వచ్చారని ధ్వజమెత్తారు.

కెటిఆర్ తన తండ్రికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారన్నారు. ఆయనను సిరిసిల్ల ప్రజలు పొలిమేర దాటే దాకా తరిమి కొట్టే రోజు వస్తుందన్నారు. దివంగత వైయస్ చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం పలు పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కెటిఆర్ సిరిసిల్ల నుండి గెలుపొందినా ఇక్కడ ఉన్న సందర్భాలు తక్కువ అని.. కానీ ఇప్పుడు విజయమ్మ వస్తున్నారని పది రోజులుగా ఇక్కడే మకాం వేశాడని మండిపడ్డారు. కెటిఆర్‌కు మనసు మానవత లేదని, విజయమ్మకు అవి ఉన్నాయి కాబట్టే వచ్చారన్నారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు వచ్చిన వైయస్ విజయమ్మపై రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేయడం దారుణమని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలుచుకుంటే కెటిఆర్, కెసిఆర్, హరీష్ రావులను ఇక్కడి నుండి తరిమేస్తామన్నారు.

English summary
YSR Congress party leader KK Mahender Reddy lashed out at Sircilla MLA K Taraka Rama Rao on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X