జగన్‌కు షాక్: నటి జయప్రదకు ఉండవల్లి చేయూత

జయప్రద రాజమండ్రి సీటు నుంచి పోటీ చేస్తానంటే తాను సహకరిస్తానని ప్రస్తుతం రాజమండ్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ అధిష్టానం రాజమండ్రి టికెట్‌ను ఎవరికి ఇచ్చినా తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. పార్టీ టికెట్ విషయంలో తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
తన భవిష్యత్తు పార్టీ అధిష్టానం చేతిలోనే ఉందని, తనను రాజ్యసభకు పంపించడమా... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడమా అనేది అధిష్టానం ఇష్టమని ఆయన అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను బట్టి జయప్రదకు రాజమండ్రి లోకసభ సీటు ఇచ్చి, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను రాజ్యసభకు పంపించాలనేది కాంగ్రెసు అధిష్టానం ప్రస్తుత ఆలోచనగా అర్థమవుతోంది.
జయప్రద ఇటీవల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రాజమండ్రి నుంచి పోటీ చేయాలనే తన అభీష్టాన్ని జయప్రద సోనియా వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించారని అంటున్నారు. జయప్రద ఓ జాతీయ పార్టీలో చేరుతారని అమర్ సింగ్ శుక్రవారం చెప్పారు. దీన్నిబట్టి కూడా జయప్రద కాంగ్రెసు పార్టీలో చేరడానికి మార్గం సుగమమైనట్లు భావించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications