తెలంగాణపై రాహుల్‌గాంధీ: అమర్ కాలే నివేదిక కీలకం

కాంగ్రెసు పార్టీలో, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలో ఇప్పుడు ప్రధానంగా కాలే పేరు వినిపిస్తోంది. అధిష్టానం నిర్ణయంలో ఈయన పాత్ర ఎంతో ఉందని పలువురు తెలంగాణ కాంగ్రెసు నేతలు, ఉద్యమ నేతలు చెప్పుకుంటున్నారట. తెలంగాణకు అనుకూలంగా అమర్ కాలే ఇచ్చిన నివేదిక ముఖ్యభూమికను పోషించిందట.
అమర్ కాలే.. కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి, తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చారట. కాలే ఏప్రిల్ మొదటి వారంలో నాలుగు రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు. ఏప్రిల్ 5 నుండి జిల్లాల్లో పర్యటించిన అమర్ కాలే.. ఆయా జిల్లా కాంగ్రెసు నాయకులను కలుసుకున్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ వాదం ఎంత బలంగా నాటుకుపోయిందో తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో బలమైన తెలంగాణవాదం ఉందని, కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణను బలంగా కోరుకుంటున్నారని ఆయన గుర్తించారు. మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో గుర్తించిన ఆయన ఇదే విషయాన్ని పలువురు నేతలతో మాట్లాడుతూ... తాను అధిష్టానానికి ఓ నివేదిక ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే అతను రాహుల్‌కు, అధిష్టానానికి తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో ఓ నివేదికను ఇచ్చారు. ఆయన తన నివేదికలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ బలం, బలహీనతల పైన సంపూర్ణ, స్పష్టమైన నివేదిక ఇచ్చారట.
వచ్చే ఎన్నికలలో తెలంగాణవాదం నేపథ్యంలోనే ప్రజలు ఎక్కువగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని నివేదికలో పేర్కొన్నారట. కాంగ్రెసు నేతలు ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకు వెళ్లలేని స్థితిలో తెలంగాణవాదం ఉందని అందులో తెలిపారట. ఈ కారణంగానే రాహుల్ గాంధీ యూ టర్న్ తన మనసు మార్చుకొని ఉంటారని, సోనియా వలె ఆయన కూడా తెలంగాణకు పచ్చజెండా ఊపి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications