దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న చర్చల్లో మరో అడుగు వేసారు. ఢిల్లీలో కీలక నేతలను కలిసి న చంద్రబాబు..తమ తదుపరి సమావేశంలో ఈ నెల 19న కలకత్తాలో జరుగుతుందని..అక్కడ కార్యాచరణ ఖరారు చేస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
బిజేపీతర కూటమి సమావేశం ఈ నెల 19న కలకత్తాలో నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున కోల్‌కతాలో జరిగే తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం నేతలంతా భేటీ కానున్నారు. అందులో తాజా రాజకీయ పరిస్థితు లపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కూటమి పై చర్చల కోసం దిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు నేతలతో సమావేశమయ్యారు.

ఏపీ భవన్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ
తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో ఆయన నివాసంలో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం ఏపీ భవన్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి భోజనం చేశారు. తర్వాత శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతోపాటు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. రాహుల్ తో సమావేశం సమయంలో ఏపి లో పొత్తుల పై చర్చలకు వచ్చినట్లు సమాచారం. అయితే, పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయి పొత్తులే కీలకం..
కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు ఇబ్బందులున్నప్పటికీ జాతీయ స్థాయిలో అందరూ కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య అనివార్యత ఉందని తొలి నుంచీ తాను చెబుతున్న విషయాన్ని గుర్తు చేసారు.. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్న చంద్రబాబు..మమతా బెనర్జీ తమ ర్యాలీకి కాంగ్రెస్ ను ఆహ్వానించలేదనే అంశం పై అది సరైన సమాచారం కాదేమో అన్నారు. ఈ నెల 19న కలకత్తాలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి వచ్చే అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని..ఆ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.