4 రోజులుగా రెక్కీ.. 45 నిమిషాల వెయిటింగ్: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపిన నిందితుల పట్టివేత
ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ముంబై జుహూ ఏరియాలో ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ సమీపంలో ఈ కాల్పుల ఘటన సంభవించింది. టైగర్ ష్రాఫ్ ఉన్న కారుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. మొత్తం ఏడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
15 బృందాలు ఏర్పాటు
దీనిపై ముంబై పోలీసులు శరవేగంగా స్పందించారు. నిందితులను పట్టుకోడానికి ప్రత్యేకంగా 15 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన ఇద్దరితో పాటు ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మరో ముగ్గురిని కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. 16 గంటల వ్యవధిలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ కోటా రైల్వే స్టేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడిని మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నారు. దాడి జరిగిన వెంటనే ఒకడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మొత్తం అయిదుమందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన అనంతరం పరారు కావడానికి నిందితులు వినియోగించిన బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంధేరి రైల్వే స్టేషన్ వద్ద బైక్ వదిలివేసి పూణే నుంచి జైపూర్ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో ముగ్గురు నిందితులు ప్రయాణిస్తోన్నట్లు సమాచారం అందింది. దీన్ని పోలీసులు కోటా స్టేషన్ సిబ్బందికి పంపారు. అక్కడ వారిని అరెస్ట్ చేశారు.
కోటాలో దొరికారు
నిందితులు ముంబై నుంచి రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోవడానికి యత్నించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. కోటాలో చిక్కిన నిందితులను హర్యానాకు చెందిన ఫూల్ సింగ్, సోనిపట్ నివాసి రేహాన్, బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన రితిక్ కుమార్‌గా గుర్తించారు. వీరిని ప్రస్తుతం కోటా నగర పోలీస్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో చిక్కిన మరో అనుమానితుడి వివరాలను కూడా రికార్డు చేస్తున్నారు.
టైగర్ పై రెక్కీ
ఈ ఘాతుకానికి పాల్పడటానికి ముందు నిందితులు పక్కా పథకం ప్రకారమే టైగర్ ష్రాఫ్ దైనందిన కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆదివారం టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ ఆడటానికి ముంబై పుష్పా పార్క్‌కు వస్తారనే ముందస్తు సమాచారంతో దుండగులు అక్కడే సుమారు 45 నిమిషాల పాటు వేచి చూశారు. ఆట ముగిసిన అనంతరం ఆయన కారు బయటకు రాగానే ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
బైక్ కూడా స్వాధీనం
కాల్పులు జరిపిన అనంతరం నిందితులు ముంబైలో రిజిస్టర్ అయిన పల్సర్ బైక్‌పై పారిపోయారు. ఆ తర్వాత తమ వాహనాన్ని అంధేరీ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంధేరీ స్టేషన్ వెలుపల నుంచి ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనం నంబర్ ప్లేట్, ఛాసిస్, ఇంజిన్ నంబర్ల ఆధారంగా దాని అసలు యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసు రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications
