ఏపీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమే- సింపుల్ లాజిక్: మరో రూ.2,000 కోట్ల రుణం
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది.
ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు. ఈ నెల 16వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్.

1,000 కోట్ల రూపాయల విలువ చేసే అయిదు సెక్యూరిటీ బాండ్లను వేలం పాటకు పెట్టింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 16, మరొకటి- 19 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.
కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలన్నర రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది మూడోసారి ఇదివరకే 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది.

ఇప్పుడు మళ్లీ మరో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించబోతోంది. మొత్తం కలిపి 9,000 కోట్ల రూపాయలు రుణాలను తీసుకుంటోంది. ఏపీతో పాటు మరో ఆరు రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో.. హర్యానా- రూ. 1,000 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ.500 కోట్లు, జమ్మూ కాశ్మీర్- 1,000, మిజోరం- రూ. 1,000 కోట్ల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి.
తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 6,590 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది. అవన్నీ కూడా ఈ నెల 16వ తేదీన వేలానికి రానున్నాయి.












Click it and Unblock the Notifications