4 నియోజకవర్గాల్లో అలీ సర్వే?
సినీ నటుడు, ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్న అలీ ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు.
సినీ నటుడు, ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్న అలీ ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగాలనే గట్టి ప్రయత్నంలో ఉన్నారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈమేరకు ఆయన వ్యక్తిగతంగా సర్వే నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీచేయడానికి కూడా సిద్ధపడుతున్నప్పటికీ మొదటి ప్రాధాన్యం ఎమ్మెల్యేగా పోటీచేయడానికే.

ఎన్నికల వ్యవయాన్ని సొంతంగా భరించడానికి సిద్ధం
గుంటూరు తూర్పు, కడప, కర్నూలు, రాజమండ్రి నియోజకవర్గాల్లో సర్వే నిర్వహింపచేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లోనే పోటీచేయడానికి రాజమండ్రి సీటును కోరినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వైసీపీ కేటాయించలేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీచేసినా తాను గెలుస్తాను అనే ధీమాను అలీ వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుకు అయ్యే వ్యయం సొంతంగా భరించడానికి ఇప్పటినుంచే ఆ నగదును ప్రత్యేకంగా పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి.

కుమార్తెను బరిలోకి దింపాలని ముస్తపా ప్రయత్నాలు
గుంటూరు తూర్పు నుంచి ముస్తఫా రెండుసార్లు ఇక్కడినుంచి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో తన కుమార్తెను అభ్యర్థిగా రంగంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ తోపాటు ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. వీరిద్దరినీ కాదని వైసీపీ అధిష్టానం అలీకి నియోజకవర్గాన్ని కేటాయిస్తుందా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కడప నుంచి అంజద్ భాషా వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేననే ధీమాతో ఆయన ఉన్నారు.

జగన్ మనసులో ఏముంది?
వీటి తర్వాత రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోను పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గత ఎన్నికల్లో జగన్ హవాలోను విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాం కాబట్టి ఎలాగైనా ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందుకు రాజకీయంగా ఉద్ధండులనే పోటీకి దింపాలని చూస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఇలా ఉండగా అలీ మాత్రం ఈ నాలుగింటిలో ఒకదాన్నుంచి తాను పోటీచేయడం ఖాయమని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మనసులో ఏముంది? అలీకి సీటు కేటాయిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications