ఈ స్థానాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ తప్పదా..? వీడని పంతం..!!
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ రోజు స్క్రూటినీ జరుగుతోంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు. ఈ నెల 28న పోలింగ్. కూటమి పార్టీల్లో మూడు పార్టీలకు సీట్ల కేటాయింపు.. నామినేషన్ల దాఖలు పూర్తి చేసారు. అయితే.. కేటాయింపులకు భిన్నం గా పలు ప్రాంతాల్లో కూటమి పార్టీలు ఫ్రెండ్లీ కంటెస్ట్ కు దిగాయి. వీరిని రంగం నుంచి తప్పించేలా కసరత్తు జరుగుతోంది. సమయం సమీపిస్తున్న వేళ టెన్షన్ పెరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని నామినేషన్లు సైతం దాఖలు చేసారు. జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు కార్పోరేషన్లు కేటాయించారు. అదే విధంగా జనసేనకు 21 మున్సిపాల్టీలు దక్కాయి. కాగా.. నామినేషన్ల సమయంలో పలు చోట్ల టీడీపీకి కేటాయించిన సీట్లలో జనసేన శ్రేణులు... అదే విధంగా జనసేన కు కేటాయించిన పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు నామినేషన్లు దాఖలు చేసాయి.ఇక, నామినేషన్ల విత్ డ్రాకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలోనే ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ నామినేషన్లు దాఖలు చేసిన వారు చెబుతుండటం కీలకంగా మారుతోంది. వారితో విత్ డ్రా చేయించేందుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే విజయనగరం కార్పోరేషన్ తో పాటుగా మున్సిపాల్టీలు.. వార్డుల్లో కూటమి నుంచి ఒకటికి మంచి నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం కార్పొరేషన్ మేయర్ పదవికి టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. విజయనగరం టీడీపీకే కేటాయించినా.. జనసేన నుంచి నామినేషన్ దాఖలు చేసారు. ఇక, డివిజన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పది డివిజన్లలో జనసేన నామినేషన్ వేసింది. ఏలూరు కార్పొరేషన్ జనసేనకు కేటాయించగా టీడీపీ అభ్యర్థి కూడా మేయర్ పీఠానికి నామినేషన్ వేశారు. విశాఖ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మరో కీలకమైన విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనూ జనసేన, టీడీపీలు వార్డుల వారీగా నామినేషన్లు వేశాయి. దీంతో.. పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఖరారు చేసిన వారికి మద్దతుగా మిగిలిన వారితో విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో.. నామినేషన్ల విత్ డ్రా సమయానికి వీరిలో ఎంత మంది తప్పుకుంటారు... ఎవరు పోటీలో ఉంటారు.. ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ రాజకీయంగా పెరుగుతోంది.














Click it and Unblock the Notifications
