పులివెందుల ఉపఎన్నిక ! రఘురామ వార్నింగ్ కు అంబటి కౌంటర్..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకటి రెండు సార్లు కనిపించడం మినహా శాసనసభకు రావడమే మానేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. విపక్ష నేత హోదా ఇస్తే కానీ అసెంబ్లీకి రానని మొండిపట్టు పట్టిన జగన్ ను ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలని అధికార కూటమి నేతలు శతవిథాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన అసెంబ్లీకి రాకపోతే పులివెందులలో ఉపఎన్నికలు తప్పవంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి.
గతంలోనూ ఓసారి జగన్ అసెంబ్లీకి తగినన్ని రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామంటూ రఘురామ హెచ్చరించడం, ఆ తర్వాత ఆయన హాజరు కావడం జరిగాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్ధితి యథాతథంగా ఉంది. దీంతో ఈసారి రఘురామ చేసిన హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందుల ఉపఎన్నికలు వస్తాయన్న రఘురామ హెచ్చరికలపై స్పందిస్తూ అదీ చూద్దామన్నారు.

చంద్రబాబు అసెంబ్లీ రాకుండా వెళ్లిపోయిన విషయం అందరికీ గుర్తుందని, బావురు మంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోయారని, అప్పుడు కుప్పానికి ఉపఎన్నికలు వచ్చాయా అని అంబటి ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూడా రాజీనామా చేసి సీఎంగానే వస్తానని చెప్పి వెళ్లిపోయారని, అప్పుడు ఉపఎన్నికలు వచ్చాయా అని అడిగారు. తాను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నానన్నారు. అప్పుడు జరగని ఉపఎన్నికలు ఇప్పుడు పెడతారా అని ప్రశ్నించారు. వీళ్లు అంత సమర్ధులే అన్నారు.
రిపోర్టర్: @ysjagan అసెంబ్లీకి రాకపోతే పులివెందుల ఉపఎన్నిక జరుగుతుంది అని అంటున్నారు@AmbatiRambabu : #ChandrababuNaidu అసెంబ్లీలో బావూరు మన ఏడ్చి వెళ్ళినప్పుడు కుప్పంలో ఉప ఎన్నిక జరిగిందా? #YSjagan ను చూసి ఎందుకు భయపడుతున్నారు? pic.twitter.com/8WP7Vm1dYe
— Lohith Reddy (@LohitReddyFan) September 6, 2025
కోయ ప్రవీణ్ సాయంతో పులివెందులలో ఉపఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో కోయ ప్రవీణ్ సాయంతో గెలిచారని, ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నారన్నారు. అక్కడ మీరు గెలవలేదని, టెక్నికల్ గా గెలిచి నైతికంగా ఓడిపోయారన్నారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూద్దామని, ఏదైనా చేస్తే ప్రతిఫలం కూడా అనుభవిస్తారని అంబటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications