సూత్రధారి ఆయనే- బాంబు పేల్చిన అంబటి మూడో కుమార్తె.. !!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు.
జగన్ నిర్వహించిన గుంటూరు పర్యటన అనుకున్నదానికంటే అధికంగా విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ టీడీపీ సారథ్యంలోని కూటమి నాయకులు ఊరూరా ఫ్లెక్సీలు వేయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దాడులకు దారి తీశాయి. పెట్రోల్ బాంబులు విసురుకునేంత స్థాయికి చేరుకుందనేది తేటతెల్లమైంది.

ఈ పరిణామాల మధ్య అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ తెరమీదికి వచ్చారు. అమెరికా నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. తాను అన్న మాటను అంబటి రాంబాబు ఉపసంహరించినా.. తాను ఆ మాట అని ఉండకూడదని పశ్చాత్తపం తెలిపినా కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. చట్టపర చర్యలు సైతం ఎదుర్కొనడానికి ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
అయినప్పటికీ ఈ దాడికి పూనుకున్నారని, తండోపతండాలుగా తరలివచ్చి ఇంటిని ధ్వంసం చేశారని శ్రీజ అన్నారు. దీని వెనుక టీడీపీకి వేరే అజెండాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సుమారు 10 గంటల పాటు అంబటి రాంబాబుపైనే కాకుండా తమ కుటుంబంపైనా, రాజకీయాలకు సంబంధం లేని తల్లి, సిస్టర్స్, వారి పిల్లల మీదా బూతు పదజాలాన్ని వాడుతూ దాడి చేశారని అన్నారు. ఈ దాడి మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఓ డాక్టర్, కేంద్రమంత్రి అని.. పరోక్షంగా పెమ్మసాని చంద్రశేఖర్ ను ఉద్దేశించి చెప్పారు.
ఓ డాక్టర్ గా ఉన్నత చదువులు చదివిన ఆయన తన ఈవిల్ థాట్స్ ను సరైన మార్గంలో పెట్టలేకపోయారని, ఇది తనకు అంతుచిక్కని ప్రశ్నలా మారిందని శ్రీజ చెప్పారు. దాడి చేయడానికి ఎంతమంది తమ ఇంటిపైకి వచ్చారో.. జగన్ రాక సందర్భంగా దానికి పదింతల మంది ప్రేమ ఆప్యాయతలతో తమను పరామర్శించారని అనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి అండ, జగన్, ప్రజల ఆదరాభిమానులు ఉన్నంత వరకు తమపై పడిన ప్రతి రాయీ.. పువ్వుగా మారుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications