AP Family Card: ఏపీ సర్కార్ ఫ్యామిలీ కార్డు-లాభాలు, సవాళ్లు ఇవే..!
ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన కొత్తలో అభివృద్ధి గురించే ఆలోచిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారనే ముద్ర ఉండేది. తొలి ఏడాదిలో పెన్షన్ల పెంపు మినహా చెప్పుకోదగిన సంక్షేమ పథకాలను, హామీలను అమలు చేయకపోవడమే ఇందుకు కారణం. అయితే ఏడాది పాలన పూర్తయిన తర్వాత దీనిపై వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పునరాలోచనలో పడిన ప్రభుత్వం హామీల్ని తక్షణం అమలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే అమలు కూడా చేసేస్తోంది. దీంతో పాటు కొత్తగా మరో కార్యక్రమం చేపట్టనుంది.
అదే ఫ్యామిలీ కార్డు. సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని, ఇందులో వారికి ప్రభుత్వం నుంచి ఏయే పథకాలు అందుతున్నాయో మొత్తం వివరాలు కనిపించేలా వీటిని ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష కూడా చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వంతో పాటు వాటిని అందుకోబోతున్న సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి సవాళ్లు ఉన్నాయన్న అంశాల్ని ఓసారి చూద్దాం.

ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు వారికి అందుతున్న ప్రయోజనాల్ని నిత్యం చూసుకునేలా ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా ఫ్యామిలీ కార్డులు జారీ చేయడం ద్వారా సంక్షేమ ఫలాలు అందుకునే వారిలో ప్రభుత్వంపై సంతృప్త స్థాయి పెరుగుతుందని, ఎలాగో పథకాలు ఇస్తున్నాం, దాని ప్రయోజనం వారికి గుర్తుంటే అది భవిష్యత్తులో తమకు రాజకీయంగా మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ కార్డులో ఓసారి కుటుంబ సభ్యుల్ని చేర్చిన తర్వాత వారి వయసు మారుతున్న కొద్దీ కొన్ని సంక్షేమ పథకాల నుంచి వారిని తొలగించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవు.
ఉదాహరణకు విద్యార్థులకు ఇంటర్ వరకు తల్లికి వందనం, ఆపై ఫీజు రీయింబర్స్మెంట్, పెద్దలు 60 దాటితే పింఛను ఇలా విద్య, వయసు బట్టి కొన్ని పథకాలు మారుతూ ఉంటాయి. స్థిరంగా ఉండవు. అటువంటప్పుడు ఫ్యామిలీ కార్డు వలన ఉపయోగం ఏమిటనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ మార్పులు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

మరోవైపు సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇప్పటికే పలు రకాల కార్డులు ఇస్తున్నారు. వీటికి తోడు మరో కార్డును వారు వాడాల్సి వస్తుంది. అలాగే లబ్దిదారులు ఆయా పథకాలు తీసుకుంటూ, వాటిలో మార్పులు జరిగినప్పుడు అంటే వయసు మారిపోతే ఆయా పథకాలకు అనర్హత వచ్చేస్తే అప్పుడు ఆయా మార్పుల కోసం తిరిగి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరాగాలా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని మార్పులు చేసే యంత్రాంగం అందుబాటులో ఉంచితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్డుల్ని నడిపించవచ్చన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications