శ్రీవారి భక్తులకు ఈఓ తీపి కబురు- అన్ని టీటీడీ ఆలయాల్లో ఇకపై..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,512 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
టీటీడీ ఆలయాలన్నింట్లోనూ మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టడానికి చర్యలు చేపట్టాలని కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం టీటీడీ ఆధీనంలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరునాటికి అన్ని ఆలయాల్లో రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని అన్నారు. గువాహటి, పాట్నా, కోయంబత్తూరు, బెళగావిల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
హృషికేశ్ పీఏసీ కూలిపోయే స్థితిలో ఉందని, ఇంజినీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టి వచ్చే ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించడానికి తేదీలను ఖరారు చేయాలని ఆదేశించారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో 164 మందిని టీటీడీ ఆలయాల్లో, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాల్లో నియమించడానికి వీలుగా ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.
టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టిటిడి సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈ-మెయిల్స్‌ను విశ్లేషించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications