తలమాసినోళ్లు దొరక్కపోరు! కేసీఆర్‌కు సత్యకుమార్ సవాల్, ‘బీఆర్ఎస్’ కు కొత్త నిర్వచనం
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీ, బీజేపీ నేతలు తమకు టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో కేసీఆర్ కూడా నేరుగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌కు ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ సవాల్
ఈ నేపథ్యంలో ఏపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్తను అయినా కేసీఆర్ పెట్టబోతున్న బీఆర్ఎస్ పార్టీలోకి లాక్కోగలిగితే తన ముక్కును నేలకు రాస్తానని కేసీఆర్‌కు సత్యకుమార్ సవాల్ విసిరారు. మీరు పుట్టిన కాంగ్రెస్, పెరిగిన టీడీపీ, తోడుదొంగ వైసీపీతో ట్రై చేసుకోండి.. ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు అంటూ సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ అంటే భారత బార్ అండ్ రెస్టారెంట్ సమితి అంటూ ఎద్దేవా
అంతేగాక, కేసీఆర్ కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు బీఆర్‌ఎస్‌కు కూడా సత్యకుమార్ కొత్త నిర్వచనం ఇచ్చారు. భారత బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న సందర్బంగా తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ నేతలు.. కోళ్లు, మద్యం పంపిణీ చేస్తున్న ఫొటోలను ట్వీట్ చేస్తూ సత్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దసర పండగ రోజున తన జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లను కేసీఆర్ ఆహ్వానించారు. అంతేగాక, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 280కిపైగా నేతలు కూడా కేసీఆర్‌తో భేటీ కానున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, ఇతర వివరాలను కేసీఆర్ బుధవారం ప్రకటించనున్నారు. పార్టీ పేరు బీఆర్ఎస్(భారత రాష్ట్రీయ/రాష్ట్ర సమితి) అని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications