లాస్ట్ మినిట్ లో రోజా - అంబటికి చోటు : కొడాలి నాని అవుట్ -ప్రకాశం జిల్లాకు మంత్రులే లేరు..!!
జగన్ కేబినెట్ లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా పాత మంత్రులకు 10 మందికి అవకాశం దక్కగా..కొత్తగా 15 మందిని ఎంపిక చేసారు. అయితే, విస్తరణ పైన కసరత్తు ప్రారంభించిన సమయం నుంచి తిరిగి చిత్తూరు జిల్లాలో మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి.. నారాయణ స్వామి కొనసాగింపు ఖాయమని తెలియటంతో ఇక, రోజాకు ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం రోజా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, అనూహ్యంగా చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా వరుసగా రెండు సార్లు నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలోనే రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేసినా..సామాజిక సమీకరణాల పేరుతో ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు సైతం అవే సమీకరణాలు ఉన్నా..రోజాకు మంత్రి పదవి లభించింది. అదే విధంగా అంబటి రాంబాబు పేరు తొలి నుంచి రేసులో ఉన్నా..కసరత్తు ప్రారంభించిన తరువాత కాపు వర్గానికి గతంలో నాలుగు స్థానాలు ఉండగా..మూడుకు తగ్గించాలని భావించటంతో అంబటికి సాధ్యం కాదని భావించారు.

చివరి నిమిషంలో అంబటికి ఛాన్స్
కానీ, గుంటూరు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలతో అంబటికి అవకాశం ఇచ్చారు. దీని ద్వారా టీడీపీ - జనసేన పైన విరుచుకుపడే వారిలో రోజాతో పాటుగా అంబటికి అవకాశం దక్కింది. అయితే, అనూహ్యంగా కొడాలి నాని పేరు లిస్టు నుంచి తప్పించారు. పాత మంత్రులను కొనసాగించే క్రమంలో భాగంగా కొడాలి నానికి తిరిగి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో కొడాలి నాని పేరు తప్పించారు. క్రిష్ణా జిల్లా నుంచి ఇద్దరు నానీలకు అవకాశం దక్కలేదు. అయితే, అనూహ్యంగా ప్రకాశం జిల్లాకు ఇప్పటి వరకు వెల్లడించిన జాబితాలో మంత్రి పదవి కేటాయించలేదు.

ప్రకాశం జిల్లాకు మంత్రి లేకుండానే
బాలినేని..ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నారు. అయితే, కొనసాగిస్తే ఇద్దిరనీ కొనసాగించాలి..లేకుంటే ఇద్దరిని తప్పించాలనే బాలినేని డిమాండ్ తో ఇప్పుడు ఇద్దరినీ తప్పించారు. ఆ జిల్లాకు ఎవరూ మంత్రి లేకుండా ఇప్పటి లిస్టు బయటకు వచ్చింది. అయితే, ప్రకాశం లాంటి జిల్లాకు మంత్రి పదవి లేకుండే అవకాశం లేదు. దీంతో.. చివరి నిమిషంలో మరో సారి మార్పులకు ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ అంశంగా మారుతోంది. కొడాలి నానికి మంత్రి పదవి దక్కక పోవటంతో ఆయనకు...ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ గా నియమించనున్నారు.












Click it and Unblock the Notifications