పార్టీల పేర్లతో జగన్ ఆసక్తికర ట్వీట్ -బైడెన్ ప్రస్తావన లేకుండా కమలపై కామెంట్స్ -కేటీఆర్ భిన్నంగా
అగ్రరాజ్యంగా దాదాపు అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది కాబట్టే అమెరికా ఎన్నికల ఫలితాలపై పలు దేశాల నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ప్రెసిడెంట్, వై ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్, కమలా హ్యారిస్ లకు అభినందనలు తెలిపారు. దేశంలోని ప్రముఖ నేతలు సైతం అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్లు చేశారు.

సీఎం జగన్ ట్వీట్‌పై చర్చ..
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక నేతల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆదివారం ఉదయమే అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందన తెలిపారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, అందుకు కమలా హ్యారిస్ ఉదాహరణ అని, భారతీయ మూలాలున్న ఆమె గెలుపు అందరికీ గర్వకారణమని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ తన పనిలోనూ విజయం సాధించాలని కోరుతున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అమెరికా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అయితే ఆయన ట్వీట్ కొంత చర్చకు దారితీసింది.

పార్టీల పేర్లు ప్రస్తావించినా..
‘‘డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా''అని ఏపీ సీఎం ట్వీట్ చేశారు. కేవలం కమలకు మాత్రమే విషెస్ చెబుతూ, ఆమె సుపీరియర్, కొత్తగా అధ్యక్షుడిగా గెలుపొందిన జోబైడెన్ పేరును మాత్రం జగన్ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇది పట్టదగిన అంశం కానప్పటికీ కొంత చర్చకు దారితీసింది. ఇకపోతే,

కమల సందేశం అద్భుతం..
భారతీయ, ఆఫ్రికన్ మూలాలున్న వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలవడం మొదటిసారే అయినప్పటికీ.. ఇదే చివరిసారి కాబోదంటూ తన తొలి విక్టరీ స్పీచ్ లో కమల హ్యారిస్ అన్నారు. ఇకపై కొత్త అమెరికాను చూడబోతున్నారంటూ శనివారం ఆమె చేసిన ప్రసంగంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం జోబైడెన్, కమలను విష్ చేస్తూ, ఆమె ప్రసంగాన్ని ప్రస్తావించారు. కమల సందేశం అద్భుతంగా ఉందని, పెద్ద పెద్ద కలలు కనే యువతకు, ఆయా రంగాల్లోని ప్రజలకు కమల ఉపన్యాసం గొప్ప స్ఫూర్తి నిస్తుందని కేటీఆర్ అన్నారు. కామెంట్లతోపాటే కమల స్పీచ్ ను కూడా కేటీఆర్ షేర్ చేశారు.












Click it and Unblock the Notifications