పవన్ కళ్యాణ్ అరుదైన ఫీట్- ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్.. సర్కార్ ఏర్పాటు తర్వాత డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏరికోరి తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్న పవన్.. అప్పుడే ఓ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. ఈ మేరకు ఆయన సర్టిఫికెట్ కూడా అందుకున్నారు.
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే తనకు అప్పగించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ప్రపంచ రికార్డ్ సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినందుకు గానూ ఈ ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలకు రికార్డుగా గుర్తింపు ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలను నిర్వీర్వ్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి రాగానే దీనిపై రివ్యూ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13326 సభలు నిర్వహించి అందులో స్థానికంగా చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేయించారు. దీంతో పంచాయతీలకు కొత్త కళ వచ్చినట్లయింది. అలాగే పంచాయితీలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు.












Click it and Unblock the Notifications