అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అంశాల్లో ఒకటి- రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ. దీన్ని లాంఛనంగా చేపట్టింది కూడా. కిందటి నెల 24వ తేదీన ఆర్ 5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి జగన్ భూమి పూజ సైతం చేశారు.
ఈ పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రభుత్వాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలు జరపొద్దంటూ స్టే ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేయబోతోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయనుంది.

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ఆర్ 5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నోటిఫై చేస్తూ గతంలో గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని జోన్ ఏర్పాటు చేసినట్లు ఇందులో పొందుపరిచింది.
దీనిపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆర్ 5 జోన్‌కు వ్యతిరేకంగా 18 పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు ఈ ఉదయం తన తుది తీర్పును వెలువడించింది. ఇళ్ల నిర్మాణంపై స్టే విధించింది. స్టేటస్ కోను కొనసాగించాలని ఆదేశించింది. ఆర్ 5 జోన్ పరిధిలో ఇప్పుడున్న పరిస్థితులను యధాతథంగా కొనసాగించాలని, ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదని పేర్కొంది.
ఈ మేరకు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రరాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హారీతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్.. తీర్పు ఇచ్చింది. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న వేళ.. జగన్ స్వయంగా భూమిపూజ చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తీర్పు ప్రభుత్వాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసినట్టయింది.
రాజధాని అమరావతికి సంబంధం లేనివారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికే ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేశారనేది పిటీషనర్ల వాదన. దీనికోసం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు బదలాయించడం సీఆర్డీఏకు విరుద్ధమంటూ పిటీషనర్ల తరఫున అడ్వొకేట్లు చేసిన వాదనలతో బెంచ్ ఏకీభవించింది.
కాగా- హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లింది ప్రభుత్వం. ఇవ్వాళ అప్పీల్ పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసేలా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ విధానాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. త్వరలోనే విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications