ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులకు ఇక గుడ్ బై- రవాణాశాఖ సంచలన ప్రకటన..
ఏపీలో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ లతో పాటు రిజిస్ట్రేషన్ కార్డులు(ఆర్సీలు) జారీని నిలిపేస్తూ ఏపీ రవాణాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసయినా కార్డుల జారీ మాత్రం ఉండదు. కేవలం యాప్ లలో వాటిని చూసుకోవాల్సిందే. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో లక్షలాది మంది వాహనదారులపై ఈ ప్రభావం పడబోతోంది.

ఏపీలో ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు యాప్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుందని, కార్డుల జారీ ఇకపై ఉండబోదని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా వీటి కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది వాహన దారులకు క్లారిటీ వచ్చినట్లయింది. ఇకపై రోడ్లపై కూడా పోలీసులు, రవాణా సిబ్బంది వాహనాలు ఆపినప్పుడు ఇలా డౌన్ లోడ్ చేసుకున్న లేదా యాప్ లలో కనిపించే పత్రాలు చూపిస్తే సరిపోతుంది.
వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది వాహనదారుల దగ్గర లైసెన్స్ కార్డు లేదా ఆర్సీ కార్డు జారీకి రూ.200తో పాటు పోస్టల్ ఛార్జీ రూ.25 కలిపి మొత్తం రూ.225 వసూలు చేస్తోంది. కానీ కొంతకాలంగా వీటిని వసూలు చేయడం ఆపేశారు. అయితే ఇప్పటికే ఇలా ఛార్జీలు వసూలు చేసిన వాహనదారులకు కార్డుల్ని త్వరలో జారీ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు. మిగతా వారు మాత్రం కార్డుల్ని యాప్ లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాల వెనుక ఓ కీలక కారణం ఉంది.
రవాణాశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని కేంద్ర ప్రభుత్వం వాహన్ పరివార్ వెబ్ సైట్ లో చేర్చింది. దీంతో రాష్ట్రాల రవాణాశాఖ వెబ్ సైట్లలో ఏదీ అందుబాటులో లేకుండా పోయింది. గతంలోలా కార్డుల డౌన్ లోడ్ వంటి ఆప్షన్లు కూడాతీసేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ కింది వెబ్ సైట్లలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ లను డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. అలాగే ఏ యాప్ లో ఈ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చో వివరాలు కూడా ఇచ్చారు.
ఏపీలో రవాణాశాఖ వెబ్ సైట్ https://aprtacitizen.epragathi.org లోకి వెళ్లి ఫారం 6 లేదా 23 డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే APRTACITIZEN ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా ఈ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రోడ్లపై పోలీసులు, రవాణాశాఖ సిబ్బంది వాహనాలు ఆపితే ఈ కార్డుల్ని యాప్ లో చూపిస్తే సరిపోతుందని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో వాహనదారులు ఈ మార్పుల్ని గమనించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications