ఏపీలో ఈ జిల్లాల్లో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!!
రాష్ట్రాన్ని వణికించిన మొంథా తీవ్ర తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. అర్ధరాత్రి నరసాపురం వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవుల ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మొంథా తీవ్ర తుఫాను అర్ధరాత్రి మచిలీపట్నం -కాకినాడ ప్రాంతానికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద తీరం దాటి భూ భాగంపైకి వచ్చింది. మొంథా ప్రభావంతో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

భారీ వర్షాల అలర్ట్స్ తో ప్రభుత్వం విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులను పొడిగించాలని నిర్ణయించింది. తుఫాను కారణంగా తొలుత ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. తాజాగా తుఫాను తీరం దాటిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా ఈ సెలవుల ను 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయించారు. విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కాగా.. కోస్తాంధ్రలో ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. మరో ఆరు నుంచి ఎనిమిది గంటలు అప్రమత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భీకరగాలులతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యే వరకూ విద్యా సంస్థలకు సెలవు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications