ఏపీలో బీసీ, కాపు రిజర్వేషన్లపై హైకోర్టు షాకింగ్..! ఇరుకునపడ్డ సర్కార్..!
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వేళ రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి కాకరేపుతోంది. ముఖ్యంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ, అలాగే గతంలో కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కోటా కేటాయిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కూటమి సర్కార్ (AP Govt) మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ రెండు అంశాల్లో హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. దీనిపై న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై నియమించిన రాజీవ్ రంజన్ కమిటీ నివేదిక రాకుండానే వీటి అమలుకు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను పెంచారో చెప్పాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మాత్రం కేంద్రం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్లు 50 శాతానికి మించొదన్న తీర్పు తర్వాత కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని కూడా చెప్పిందని గుర్తుచేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచినట్లు తెలిపింది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 16న తదుపరి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది.

మరోవైపు రాష్ట్రంలో గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ కాపులకు రిజర్వేషన్లపై జరిగిన పోరాటాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని అమలుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి కూడా పంపింది. కానీ కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అలాగే సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ 5 శాతం కాపు రిజర్వేషన్లు ఇప్పటివరకూ అమలు కాలేదు. 2023లో ఈ రిజర్వేషన్ల అమలుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కాపు సంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు తాజాగా విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందన తెలియజేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు.. సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిన ఈ రిజర్వేషన్లపై అభ్యంతరాలు ఉంటే అక్కడే రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.














Click it and Unblock the Notifications
