ప్రధాని మోదీకి అదిరిపోయే ఆతిథ్యం- భోగాపురం ప్రారంభం వేళ..!!
ఆగస్టు 1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వేళ పండుగ వాతావరణం ఏర్పడనుంది. ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రారంభ వేడుక నిర్వహణ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రారంభ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. 13 వేల మంది గిరిజన కళా కారులతో థింసా నృత్య ప్రదర్శన.. రెండు లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న మోదీకి ఘన స్వాగతం లభించనుంది. అదే విధంగా విమానాశ్రయ ప్రారంభ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 13 వేల మంది గిరిజన కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రదర్శన ఉండనుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ భోగాపురం ప్రారంభ వేడుక పైన చర్చించారు. షెడ్యూల్ ఖరారు చేసారు. మంత్రులు ఈ నెల 25వ తేదీ నుంచి అక్కడే మకాం వేయాలని సీఎం నిర్దేశించారు.

కేబినెట్ సమావేశంలో మంత్రులకు బాధ్యతలు
ఇందులో భాగంగా ప్రతీ నెలా 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లను ఈ కార్యక్రమం కారణంగా ముందు రోజునే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. థింసా నృత్యం తో ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పే విధంగా 13 వేల మంది తో నృత్యం ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం..రోడ్ షో ఉంటాయి. మరో 22 నిమిషాలు..భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధాని సందర్శన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని రోడ్ షో లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఉండనున్నారు. ఆ తరువాత దాదాపు గంటన్నర సేపు బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసారు. రెండు లక్షల మంది తో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక ద్వారా విమానాశ్రయం అంటే భోగాపురం మాత్రమే అని ఎలివేషన్ రావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో.. ఈ నెల 25 నుంచి కొంతమంది మంత్రులు భోగాపురం లోనే మకాం వేయనున్నారు. ఏర్పాట్లు పై నిరంతర పర్యవేక్షణ చేస్తూ.. ఈ వేడుక సక్సెస్ చేసేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications