పెన్షన్ల తొలగింపుపై ఏపీ సర్కార్ కు షాక్ ..! హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అతి ముఖ్యమైనవి ప్రతీ నెలా ఇచ్చే సామాజిక పెన్షన్లు (Social Pensions). ఈ పెన్షన్లను ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు, చేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా వింటూ నిబంధనలను పక్కనబెట్టేసి ఇష్టారాజ్యంగా కొత్త పెన్షన్లు ఇచ్చేస్తూ, ఉన్న పెన్షన్లు తీసేస్తున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు (AP High Court) తాజాగా ప్రభుత్వానికి షాకిచ్చింది.
సామాజిక పెన్షన్లు కొత్తగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అలాగే తొలగించాల్సి వచ్చినప్పుడు నిష్పాక్షిక, పారదర్శక విచారణ అవసరమని హైకోర్టు తేల్చిచెప్పింది. అర్హులకు ఏకపక్షంగా పెన్షన్లు తొలగిస్తే సామాజిక భద్రత పెన్షన్ పథకం ఉద్దేశం నేరవేరదని తెలిపింది. కాబట్టి పెన్షన్లు తొలగించాల్సి వస్తే అందుకు సహేతుక కారణాలను అధికారులు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిలా ఇచ్చాపురంలో ఐదుగురికి పెన్షన్లు తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.

ఇచ్చాపురంలో పెన్షన్లు తొలగించిన ఐదుగురికి తక్షణం దాన్ని పునరుద్ధరించడంతో పాటు బకాయిలను సైతం 12 వారాల్లో చెల్లించాలని ఎంపీడీవోకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2024లో తొలగించిన ఈ పెన్షన్లపై స్థానిక అధికారులు తగిన విచారణ జరపలేదని హైకోర్టు అభిప్రాయపడింది. అప్పట్లోనే వీరికి పెన్షన్లు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అధికారులకు లేఖ రాసిన విషయం గుర్తుచేసింది. అయితే విచారణలో పెన్షనర్లు గ్రామంలో లేరనే కారణం చూపుతూ పెన్షన్లు రద్దు చేసినట్లు గుర్తించారు. ఆధార్ వివరాలను బట్టి చూస్తే వారు కొంతకాలంగా ఏపీలోనే ఉంటున్నట్లు హైకోర్టు తెలిపింది. కాబట్టి వారి పెన్షన్లు పునరుద్దరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.














Click it and Unblock the Notifications