ఎట్టకేలకు బీజేపీ, జనసేన సీట్లు ఖరారు - ఆ స్థానం పైనే పీఠముడి, జాబితా..!!
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అర్ద్రరాత్రి వరకు సీఎం చంద్రబాబు వద్ద మూడు పార్టీల నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఎట్టకేలకు జనసేన, బీజేపీకి ఇచ్చే సీట్ల పైన అంగీకారం కుదిరింది. ఒక్క కార్పోరేషన్ సీటు పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు అధికారికంగా జాబితా పైన ఉమ్మడి ప్రకటన చేయనున్నారు. ఇక.. అభ్యర్ధుల ప్రకటన పైనా పార్టీలు తుది కసరత్తు చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎవరు ఎన్ని చోట్ల, ఎక్కడెక్కడ పోటీచేయాలో ఖరారైంది. 4 కార్పొరేషన్లు, 20 వరకు మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. బీజేపీ ఒక కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల్లో పోటీచేయనున్నట్లు తెలిసింది. 12 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో టీడీపీ బరిలో నిలుస్తుందని సమాచారం. విజయవాడ, ఒంగోలు, కాకినాడ, తిరుపతి కార్పొరేషన్ల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, ఒంగోలు స్థానంలో శ్రీకాకుళం జనసేనకు టీడీపీ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఈ సీటు పైనే స్పష్టత రావాల్సి ఉంది. తిరుపతి జనసేనకు అని చెబుతున్నా.. ఏలూరు పైనా సస్పెన్స్ కొనసాగుతోంది. జనసేనకు ఏలూరు ఇస్తే టీడీపీ తిరుపతి నుంచి పోటీ చేయనుంది.

నేడు అధికారిక జాబితా ప్రకటన
ఇక, బీజేపీకి రాజమహేంద్ర వరం కార్పోరేషన్ సీటు ఇస్తామని టీడీపీ ప్రతిపాదన చేసింది. కాగా.. బీజేపీ నెల్లూరు కోసం పట్టు బడుతోంది. ఇక.. జనసేనకు పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోనిలు ఉన్నాయని చెబుతున్నారు. పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీలు ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీకి యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, ఎర్రగుంట్ల, గూడూరు(కర్నూలు జిల్లా) ఇవ్వనున్నారు. ఈ రోజు తుది చర్చల తరువాత మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ స్థానాల పైన ప్రకటన చేయనున్నారు.













Click it and Unblock the Notifications
