"ఏబీసీడీ" అవార్డులను ప్రకటించిన ఏపీ పోలీస్ శాఖ.. 13 బెస్ట్ కేసులకు సెలెక్ట్ !!
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 2025 సంవత్సరానికి గాను 'అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్' (ABCD) పురస్కారాలను ప్రదానం చేసింది. నేర పరిశోధన విభాగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన అధికారులకు అవార్డులు, నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజేతలకు అవార్డులను అందజేశారు.
ఈ ఏడాదిలో నేరాలను ఛేదించడంలో పోలీసు అధికారులు అనుసరించిన సాంకేతిక పద్ధతులు, ఆధునిక టెక్నాలజీ వినియోగం.. వినూత్న దర్యాప్తు విధానాలపై సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. డేటా అనలిటిక్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సీసీటీవీ విశ్లేషణ, మొబైల్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతుల వినియోగాన్ని ఈ సమీక్షలో ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో భాగంగా మొదటి త్రైమాసికంలో 4 కేసులు.. రెండో త్రైమాసికంలో 4 కేసులు.. మూడో త్రైమాసికంలో 5 కేసులు సెలెక్ట్ చేశారు. మొత్తంగా 13 అత్యుత్తమ కేసులను ఎంపిక చేసి, వాటిని సమర్థవంతంగా ఛేదించిన అధికారులను ఏబీసీడీ అవార్డులకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ... పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని అన్నారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నేర పరిశోధనలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మిగిలిన సిబ్బందికి కూడా ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవార్డుల ద్వారా పోలీసు శాఖలో పోటీతత్వం, నైపుణ్యం, బాధ్యతా భావం మరింత పెరుగుతుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
కాగా భవిష్యత్తులో కూడా ప్రతి త్రైమాసికం ఉత్తమ పనితీరును గుర్తించి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, నేరస్తులను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంలో ఏపీ పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని అధికారులు స్పష్టం చేశారు.
🏆 Award for Best in Crime Detection – 2025
— Andhra Pradesh Police (@APPOLICE100) December 19, 2025
At the #APPolice Headquarters, for the year 2025, #CID DGP Sri Ravishankar Ayyanar IPS comprehensively reviewed the technical methods and innovative approaches used in solving cases in the field of criminal investigation (1/4) pic.twitter.com/av6b3IZmFH












Click it and Unblock the Notifications