ఏపీని వదలని అల్పపీడనం.. బంగాళాఖాతం హెచ్చరికతో మళ్ళీ భారీవర్షాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చలికాలంలో కూడా వర్షాలు వదిలిపెట్టడం లేదు ఒకదాని తరువాత ఒకటి వరుసగా అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు రావడంతో ఏపీవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపైన సగటున సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజుల్లో ఇది బాగా బలపడుతుందని పేర్కొన్నారు .దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ యానంతో పాటు దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

నేడు, రేపు వాతావరణం ఇలా
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాగల నాలుగు రోజుల వరకు వాతావరణ సూచన లో భాగంగా ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
సోమవారం ఈ జిల్లాలలో వర్షాలు
ఇక ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం మీదగా విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో సోమవారం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
మంగళవారం వర్షాలు పడే ప్రాంతాలు ఇవే
ఇక మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వ్యవసాయ పనులు చేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ఆయా జిల్లాల ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications