ఏపీకి బంగాళాఖాతం మేఘసందేశం.. గోదావరి శాంతిసందేశం!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పలు గ్రామాలు వరదముంపుకు గురికాగా ఆయా గ్రామాలలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో అల్పపీడన ప్రభావంతో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఏపీలో నేడు ఈ జిల్లాలలో వర్షాలు
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు కాకినాడ, కృష్ణ, నెల్లూరు, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

నేడు సాయంత్రం ఈ జిల్లాలలో వర్షాలు
కాగా ఈరోజు తెల్లవారుజామున సమయం లో అమరావతి,విజయవాడ పరిసర భాగాల్లో జల్లులు నమోదయ్యాయి.ఈరోజు మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు,మచిలీపట్నం, రాజమండ్రి, దివిసీమ భాగాల్లో,విజయవాడ, ఏలూరు, ప్రకాశం, జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, జిల్లాలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతాయి.
శాంతిస్తున్న గోదావరి
ఇది ఇలా ఉంటే నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఇప్పుడిప్పుడే క్రమంగా శాంతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.8 అడుగులుగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం వద్ద 12.8 మీటర్లకు నీటిమట్టం ఉందని, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 12.95 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది.
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు పడతాయని చెప్పిన ప్రాంతాల ప్రజలు వర్షాలు పడే సమయంలో బయట చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని, వ్యవసాయ పనులు చేసే వారి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications