AP rains: వణికించే చలిలోనూ ఏపీని వదల బొమ్మాలీ అంటున్న బంగాళాఖాతం!
ప్రస్తుతం డిసెంబర్ నెల కొనసాగుతుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదలడం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఉపరితల ద్రోణుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అల్పపీడనం.. ఏపీకి మళ్ళీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన ఈ అల్పపీడనం డిసెంబర్ 11వ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు అనుకొని నైరుతి బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఫెంగల్ తుఫాను ప్రభావం వదలక ముందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత పది రోజులుగా పెంగల్ తుఫాను కారణంగా నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాలలో భారీ వర్షం నమోదు కాగా ఇప్పుడు మళ్లీ ఏర్పడిన అల్పపీడనంతో వాన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నాలుగురోజుల్లో భారీ వర్షాలు
ఇక రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొనడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. కాలంగాని కాలంలో కురుస్తున్న ఈ వర్షాల దెబ్బకు ఇప్పటికే పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు ఈ అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చలిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications