ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ - ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణం..!!
ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి నేరుగా విమాన సర్వీసులు లేకపోతే మధ్యలో మరో విమానం మారి ప్రయణం చేస్తారు. ఇప్పుడు ఇదే తరహాలో ఆర్టీసీలో కొత్త విధానం తీసుకొచ్చారు. ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బస్సులు మారినా టికెట్ తీసుకొనే అవసరం లేకుండా కొత్తగా మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానాన్ని ఆర్టీసీ ప్రకటించింది.
ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయాలు:ఆర్టీసీ ఈ మధ్య కాలంలో కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తాజాగా ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన దూర ప్రాంత గమ్య స్థానాలకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో మరో బస్సు మారినా, మరోసారి టికెట్ తీసుకొనే అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ఒకే టికెట్ పైన రెండు బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. దీని కోసం మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానం ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు వెళ్లటానికి నేరుగా బస్సు లేకపోతే విజయవాడకు వచ్చి మరో టికెట్ తీసుకొని వెళ్లాల్సి వచ్చేది.

మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్:ఇప్పుడు బయల్దేరిన స్థానంలోనే నేరుగా గమ్యస్థానం టికెట్ తీసుకొని బస్సు మారి అదే టికెట్ పైన గమ్య స్థానం చేరుకొనే వెసులుబాటు కలుగుతోంది. రెండు బస్సుల్లో ప్రయాణం కోసం గతంలో రెండు టికెట్లకు ముందుగా బుక్ చేసుకుంటే రెండు రిజర్వేషన్ ఛార్జీ తీసుకొనే వారు. ఇప్పుడు మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ ద్వారా రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకే రిజర్వేషన్ ఛార్జ్ తీసుకోనున్నారు. ప్రయాణం స్థలం నుంచి గమ్య స్థానం చేరుకొనేందుకు బస్సులు మార్పుకు రెండు గంటల నుంచి 22 గంటల వరకు సమయం ఇచ్చారు.
సమయం ఛార్జీ ఆదా:ఈ సమయాల్లో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానం తొలి సారిగా అమలు చేయనున్నారు. ఇందుకోసం యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రిజర్వేషన్లు చేసుకొనే అవకాశం కల్పించారు. దేశం మొత్తంలో ఇక్కడే తొలి ఈ తరహా విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో ఈ విధంగా అధికారికంగా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా టికెట్ తీసుకోవటం కోసం సమయం కలిసి రావటంతో పాటుగా ఒక రిజర్వేషన్ ఛార్జీ భారం ప్రయాణీకులకు తగ్గనుంది.












Click it and Unblock the Notifications