పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన టీడీపీ సీనియర్ నేత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడి పాలన సాగిస్తున్న వేళ ప్రస్తుతం స్పీకర్ గా కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన రాజకీయ జీవితం చాలని తన రాజకీయ జీవితానికి పూర్తిస్థాయిలో విరామం ప్రకటిస్తున్నట్లుగా ఆయన షాకింగ్ ప్రకటన చేశారు. 2029 ఎన్నికలలో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.
పదవులు శాశ్వతం కావన్న అయ్యన్న పాత్రుడు
తనకి కూడా వయసు పెరుగుతోందని తాను ఎంతో సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని చూసానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో పదవులు, అధికారాలు ఎవరికి శాశ్వతం కావని, ఆయన పార్టీ నేతలకు చెప్పారు. పార్టీలో పని చేసేవారు పదవీకాలంలో చేసిన మంచి పనులే వారిని చిరస్థాయిగా మంచి వారిగా గుర్తింపు తీసుకువస్తాయని ఆయన తెలిపారు.

ఆ విషయంలో ఒళ్ళు దాచుకోను
2029 లోగా తాను రాష్ట్ర ప్రజలకు చేయాలనుకున్న మంచి పనులను చేసి తీరుతానని చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.ఇక ప్రజలకు సేవ చేసే విషయంలో ఒళ్ళు దాచుకునే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన తనకు ఇంకా నర్సీపట్నం ఎమ్మెల్యేగా నాలుగేళ్ల ఎనిమిది నెలల పదవీకాలం ఉందని, ఈ పదవీకాలం తాను ప్రజా సంక్షేమం కోసమే పూర్తిస్థాయిలో వినియోగిస్తానని వెల్లడించారు.
గతంలోనూ అయ్యన్న రిటైర్మెంట్ పై వార్తలు
అయితే చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాలలో చర్చకు కారణమైంది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయదలచుకోలేదని పేర్కొన్నారు. అప్పుడు టిడిపికి అత్యంత కీలకమైన ఎన్నికలు కావడంతో అధినాయకత్వం ఆయనను పోటీకి నిలిపినట్టు సమాచారం. ఇక 2024 లో కూడా ఆయన కుమారుడికే టికెట్ అడిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటానని చేసిన ప్రకటన వెనుక
మళ్లీ చంద్రబాబు ఈసారి కూడా అయ్యన్నపాత్రుడిని పోటీలో నిలపడంతో ఆయన విజయం సాధించారు. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం ఆశించిన అయ్యన్నపాత్రుడికి స్పీకర్ గా అవకాశం ఇచ్చి రాజ్యాంగబద్ధమైన పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. ఇక తాజాగా ఆయన మరో మారు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటానని చేసిన ప్రకటన వెనుక అయ్యన్న ప్లాన్ ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది.
అయ్యన్న ప్రకటన కొడుకు కోసమేనా
ఆయన తన పెద్ద కుమారుడు విజయ్ ను రాజకీయ వారసుడుగా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారా లేదా దీని వెనుక మరేమైనా మతలబు ఉందా అన్నది ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఏపీ శాసన సభా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన ప్రకటన ఇప్పుడు ఆయన రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకునే వరకు ఎందుకు వచ్చింది అన్నది ఆసక్తి.












Click it and Unblock the Notifications