వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్ వైపు అడుగులు, జైల్లో పెడతా: సొంత ఎమ్మెల్యేలకి బాబు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాపులను బిసి జాబితాలో చేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే బీసీల జాబితాలో ఉన్న వారికి నష్టం జరగకుండా, ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా... కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని భావిస్తోంది.

సోమవారం విజయవాడలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై లోతైన చర్చ జరిగింది. కాపులను బిసి జాబితాలో చేర్చే అంశాన్ని అధ్యయనం చేసే బాధ్యతను బిసి కమిషన్‌కు అప్పగించాలని నిర్ణయించింది. ఏపీ సర్కార్ త్వరలో దీనిని ఏర్పాటు చేయనుంది.

కేబినెట్లో ఉద్యోగులు అమరావతికి వచ్చే అంశం, ఇసుక మాఫియా తదితరాలపై చర్చించారు. 2017 జూన్‌ 2లోగా ఏపీకి వచ్చే వారికి స్థానికులుగా గుర్తించనుంది. ఇసుక మాఫియా విషయంలో పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదని చంద్రబాబు ఈ భేటీలో స్పష్టం చేశారు. జైల్లో పెడతామన్నారు.

ఉద్యోగులు జూన్‌ 2కు రావాల్సిందేనని, అద్దె భత్యం ఒక్కటే ఇస్తామని ఈ సమావేశంలో చంద్రబాబు అన్నారు. విభజన జరిగిన మూడేళ్లలోపు (2017 జూన్‌ 2లోగా) ఏపీకి వచ్చిన వారికే స్థానికత వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి నిర్ణయించింది.

అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉద్యోగులంతా 2016 జూన్‌ 2 లోగా ఏపీకి రావాల్సిందేనని తీర్మానించింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇచ్చే భూములను ఇప్పటివరకు 33 ఏళ్లపాటు లీజుకిస్తున్నారు. ఇప్పుడా విధానాన్ని రద్దు చేసి, ఫ్రీ హోల్డ్‌ చేస్తూ జారీచేసే ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టరూపం ఇస్తారు. తాజా నిర్ణయం ప్రకారం లీజు 99 ఏళ్ల వరకు ఉంటుంది. కాపులను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించేందుకు త్వరలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

BC commission for Kapu reservations

కాపులను బీసీల్లోకి తీసుకురావడం ద్వారా ఇప్పటికే ఉన్న బీసీలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఈ కమిషన్‌ పరిశీలిస్తుంది. మొత్తం బీసీ రిజర్వేషన్‌ 50 శాతం మించే పరిస్థితి వస్తే కేంద్రం అనుమతి తీసుకునేందుకు కూడా ప్రయత్నించాలని నిర్ణయించారు.

నవంబరు 7 లోగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు విడుదల చేయాలని, కాపుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించాక తర్వాత వెంటనే మళ్లీ నిధులను కేటాయించాలని తీర్మానించారు. పెండింగు ప్రాజెక్టుల పూర్తికి రూ.3 వేల కోట్ల విడుదలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఇప్పటివరకూ పరిశ్రమలకు మాత్రమే ఉన్న సింగిల్‌ డెస్క్‌ విధానాన్ని భవిష్యత్తులో ఐటీ, పర్యాటక ప్రాజెక్టులకు కూడా వర్తింప చేయనున్నారు. హెల్మెట్‌ వినియోగం జనవరి నుంచి తప్పనిసరి. డిసెంబరు నుంచే జరిమానా విధింపు అమలులోకి వస్తుంది.

అవినీతిని నిరోధించడం, ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ప్రజలకు లేకుండా చేసేందుకు 67 రకాల ధ్రువీకరణ పత్రాల స్థానంలో ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. తద్వారా త్వరలో కుల, ఆదాయ, జనన, నివాస వంటి ధ్రువీకరణ పత్రాల అవసరం ఉండబోదు.

కర్నూలులో రాష్ట్ర ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు ఉద్యోగులకు రూ.60 కోట్లు రుణంగా ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో మురికివాడల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్‌కి 183 ఎకరాలు కేటాయించనున్నారు. పలు పరిశ్రమలకు లీజుకు భూములు కేటాయించారు.

ఇసుక అక్రమాలను అరికట్టేందుకు అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించింది. మన ఎమ్మెల్యేలైనా, పార్టీ నేతలైనా ఎవరైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్టు ప్రయోగించి జైల్లో పెట్టడమేనని చంద్రబాబు కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారు.

English summary
BC commission for Kapu reservations in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X