కోడిపందాలకు పందెంరాయుళ్ళు రెడీ...చర్యలకు పోలీసులు సమాయత్తం...సుప్రీం తీర్పుపై ఎవరి భాష్యం వారిదే...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పశ్చిమ గోదావరి: కోడి పందాలపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించినా మరోవైపు కోనసీమలో పందెంరాయుళ్ల హడావుడి మొదలైంది. పైగా సుప్రీం కోర్టు కోడి పందేలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చిందని జోరుగా ప్రచారం జరగడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో సందడి నెలకొంది. ఏటా పోటీలు జరిగే ప్రాంతాల్లో బెట్టింగ్ రాయుళ్లు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోను కోడి పందేలు జరగనివ్వబోమని మరోవైపు పోలీసులు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నారు. ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ...కోడిపందాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుందని చెప్పారు. కోళ్లకు కత్తులు కట్టినా, గ్యాంబ్లింగ్‌ ఆటలు ఆడినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను అరెస్ట్‌ చేయొద్దని, కత్తులు కట్టని కోళ్లను పట్టుకోవద్దని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని ఎస్పీ రవిప్రకాశ్ వివరించారు. అయితే ప్రస్తుతం పోలీసుల హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు.

 జోరుగా ఏర్పాట్లు...

జోరుగా ఏర్పాట్లు...

కోడి పందేలను ప్రతి ఏటా నిర్వహించే ప్రాంతాల్లో ఇప్పటికే ప్రాంగణాలు, పోటీ బరులు, టెంట్లు, ఇతరత్రా ఏర్పాట్లు చెయ్యడం పూర్తయింది. ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది మాత్రం పండగ తేదీలకు అనుగుణంగా 14, 15, 16 తేదీల్లో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోటీలు భారీ స్థాయిలో జరిగే ప్రదేశాల్లో రాత్రీ పగలు పందేల నిర్వహణకు వీలుగా ఫ్లడ్ లైట్లను సైతం ఏర్పాటుచేస్తున్నారు.

 లోపాయికారీ...ఏర్పాట్లు కూడా

లోపాయికారీ...ఏర్పాట్లు కూడా

ఈ కోడి పందాలను చూసేందుకు భారీగా తరలి వచ్చేవారి తాకిడిని తట్టుకునేందుకు ప్రతి బరి చట్టూ పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణాల్లో టెంట్లు, వసతి సౌకర్యాలతో పాటు ఆహారం, మద్యం వంటివి అందేందుకు రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మీడియా, పోలీసులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నట్లు తెలిసింది. కోనసీమలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల, అల్లవరం మండలంలోని గోడి, కాట్రేనికోన, చెయ్యేరు, ముమ్మిడివరం మండలంలోని రాజుపాలెం, పల్లిపాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పందాలు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు కోనసీమలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి పందాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

 బెట్టింగ్...బెట్టింగ్...

బెట్టింగ్...బెట్టింగ్...

సంప్రదాయ కోడి పందేల పేరుతో ఇటీవలి కాలంలో ఇక్కడ జరుగుతోంది భారీ బెట్టింగ్. ఈ కోడి పందాలకు స్థానిక ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా మెండుగా ఉండటంతో ఏటా ఈ పోటీలు భేషుగ్గా సాగిపోతున్నాయి. పందేలు జరిగే ఊళ్లలోని లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు సందర్శకులు, జూదగాళ్లతో నిండిపోతాయంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ కోడి పందేలను చూసేందుకు విదేశాల నుండి ఎన్ఆర్ఐలు సైతం దిగిపోతుంటారంటే వీటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది సంక్రాంతికి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.100 కోట్లు.. గుండాటలు, పేకాటలు ఇతర జూదాలు, మద్యం విక్రయాల సొమ్ము మరో 50 కోట్లు టర్నోవర్‌ అయిందని అంచనా. అంటే.. అన్నీ కలిపి 150 కోట్లు. ఈసారి జిల్లాలో కోడిపందాల సొమ్మే రూ.200 కోట్లు ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

 సుప్రీం తీర్పు పై...ఎవరి భాష్యం వారిదే...

సుప్రీం తీర్పు పై...ఎవరి భాష్యం వారిదే...

కోడిపందేలపై హైకోర్టులో సవరణ పిటిషన్‌ వేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో తీర్పు తమకు సానుకూలంగానే వస్తుందని పందెంరాయుళ్లు ఆశిస్తున్నారు. కోడిపందాలపై సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే...సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలపై గతంలో ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. కోళ్లకు కత్తులు కట్టవద్దని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే తనిఖీ బృందాలు ఇళ్లలోకి వెళ్లి కోళ్లను పట్టుకోరాదని, రైతులను అరెస్టు చేయరాదని కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది కూడా ఇదే తీర్పు అమలులో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో పందెంరాయుళ్లు డింకీ పందేల పేరుతో సంప్రదాయ కోడిపందేలనే తాము నిర్వహిస్తామని, వాటికే తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. కోడిపందేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme Court Bench led by Chief Justice said the last year order of the court was clear and it applies to this year also. Thus, the betting men customizing that judgment in favor of them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X