TTD: టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీపై భూమన కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భర్తీ చేయనున్న టీటీడీలో భర్తీ చేయబోతున్న ఇంజినీరింగ్ పోస్టుల నియామక ప్రక్రియ ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో చైర్మన్ కు, బోర్డు సభ్యులకు, అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులను కోరారు.
టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టులు భర్తీ చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ ఉద్యోగాల భర్తీ విధివిధానాలపై ఛైర్మన్ భూమన స్పష్టత ఇచ్చారు. చెన్నై ఐఐటి ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా మెరిట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరుగుతాయని వివరించారు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా ఇదే తరహాలో పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని తెలిపారు. అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ ప్రారంభించనున్నట్లు భూమన వివరించారు.

గురువారం ఉదయం నుండి నిరంతరాయంగా శ్రీవారి పాదాల వద్ద ప్రతి రోజు ఈ హోమం నిర్వహిస్తారన్నారు. పెళ్లిరోజు, పుట్టిన రోజు , ఇతర విశేష రోజుల సందర్బంగా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చని తెలిపారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్లు ఇస్తున్నామని , శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక స్లాట్ ల విధానంలో టికెట్ల సంఖ్య పెంచుతామని చెప్పారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు అందిస్తున్న ఆశీస్సులుగా ఈ హోమాన్ని చూడాలన్నారు.
ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.హోమ ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు వేద విద్యార్థులు, అధ్యాపకులు, కళా బృందాలతో వేద విశ్వవిద్యాలయం నుండి గురువారం ఉదయం 7 గంటలకు ఊరేగింపుగా సప్త గో ప్రదక్షణ మందిరంకు చేరుకుంటారని వివరించారు. నవంబరు 24వ తేదీన శుక్రవారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం జరుగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications