ఆ నెలలోనే APలో ముందస్తు.. రాసిపెట్టుకో: సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయంటూ ఏడాది నుంచి ప్రచారంలో ఉంది. వైసీపీ ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు తమ శ్రేణులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు లేవని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వైసీపీ చెబుతోంది. తాజాగా ముందస్తు గురించి భారతీయ జనతాపార్టీ నేత సత్యకుమార్ స్పందించారు.
కచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన చెబుతున్నారు. పూర్తికాలం అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరుగుతుందని, తమకు మైనస్ గా మారుతుందని వైసీపీ భావిస్తోంది. ముందస్తు వ్యూహానికి ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారని సత్యకుమార్ అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతోందని, దీనికి సంబంధించిన సమాచారం మొత్తం తనదగ్గర ఉందన్నారు.

ఎన్నికలంటే యుద్ధమంటూ ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారని, ముందస్తుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లరూపాయలు వెదజల్లి గెలిచేందుకు ప్రణాళిక రచించినట్లు తనదగ్గర సమాచారం ఉందన్నారు. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు.
సత్యకుమార్ బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. సోము వీర్రాజు పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. వీర్రాజును పొడిగిస్తారా? కొత్తనేతను నియమిస్తారా? అనే విషయంలో ఆ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. 2029 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలనే లక్ష్యాన్ని బీజేపీ నిర్ధేశించుకుంది.












Click it and Unblock the Notifications