జూ ఎన్టీఆర్ తో బంధం పై తేల్చేసిన టీడీపీ...!!
ఏపీ రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. అటు ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ తాము తిరిగి 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు తమదే అధికారం అంటూ లెక్కలు వేస్తున్నారు. ఈ సమయంలోనూ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీ బంధం పైన ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తారక్ తో సంబంధం పై క్లారిటీ
కొంత కాలంగా టీడీపీతో జూ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ చేసారు. 2009 ఎన్నికల సమయంలో జూ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. ఆ సమయంలోనే ప్రమాదానికి గురి కావటంతో మధ్యలోనే ప్రచారం నిలిపివేసారు. ఇక, పార్టీ మహానాడుకు ఆ సమయంలో హాజరైన జూ ఎన్టీఆర్ తరువాత పూర్తిగా దూరం అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లోనూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. తన తాన పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా..తాను సిద్దంగా ఉంటానని జూ ఎన్టీఆర్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారు.

రాజకీయాలకు దూరంగా
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హైదరాబాద్ లో జూ ఎన్టీఆర్ కలిసిన తరువాత రాజకీయంగా అనేక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూ ఎన్టీఆర్ నిలబడలేదనే వాదన ఉంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీటి పర్యంతం...హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు సమయంలో జూ ఎన్టీఆర్ స్పందన టీడీపీ ముఖ్యులకు నచ్చలేదు. అప్పట్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న ఓపెన్ గానే జూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూ ఎన్టీఆర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు.

బుద్దా కామెంట్స్ వైరల్
ఇక, ఇప్పుడు బుద్దా వెంకన్న మరోసారి జూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీడీపీతో జూ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలనానికి కారణమయ్యారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి కూడా రాలేదని గుర్తు చేసారు. అలాంటప్పుడు జూ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. పార్టీతో జూ ఎన్టీఆర్ కు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పైన తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications