లైంగిక సేవల కొనుగోలు...అరికట్టేందుకు నూతల విధి విధానాలు:హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశం
అమరావతి:లైంగిక సేవల కొనుగోళ్లను పూర్తిగా అరికట్టడానికి సరికొత్త వ్యూహరచన అవసరమని రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ అభిప్రాయపడ్డారు. 'ఆంధ్రాలో లైంగిక సేవల కొనుగోలు నివారణ బిల్లు 2018' అనే విషయంపై సచివాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది.
Recommended Video

ఈ సమావేశంలో 'సెక్స్ కొనుగోలుదారులను నేరస్తులుగా ఆపాదించడం' అనే అంశంపై జరిగిన చర్చాకార్యక్రమానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అధికారి సెక్స్ వర్కర్లతో ఏవిధంగా మెలగాలో తెలియజేసే నూతన విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎపి...లైంగిక కొనుగోలు బిల్లు
గురువారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లైంగిక కొనుగోలు బిల్లు-2018 చర్చా కార్యక్రమానికి హాజరైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ విప్లవాత్మక సూచనలు చేశారు. ‘సెక్స్ కొనుగోలుదారులను నేరస్తులుగా ఆపాదించడం' అనే అంశంపై ఆమె మాట్లాడుతూ సెక్స్ వర్కర్లతో అధికారులు మెలిగే తీరుపై నూతన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. లైంగిక సేవల కొనుగోళ్లను పూర్తిగా అరికట్టడానికి ఈ విధమైన సరికొత్త వ్యూహరచన అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరి కొన్ని...అభిప్రాయాలు
ఈ సమావేశం స్వాగతోపన్యాసంలో మహిళాభివృద్ధి, బాలల సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్ అరుణకుమార్ అసలు ఈ సమావేశం ఏర్పాటు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాలను వివరించారు. అనంతరం ప్రభుత్వ కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ ఈ బిల్లును ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సి ఉందన్నారు. సంగ్రాం సంస్థ న్యాయవాది ఆర్తిపాయే మాట్లాడుతూ స్వచ్ఛంద సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా బాధితుల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. లైంగిక సేవలను కొనుగోలు చేసేవారిని బహిరంగంగా సిగ్గుపడేలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని చెప్పారు.

ఫారిన్ ఫ్రొఫెసర్...ఇలా అన్నారు
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కింబర్లి మాట్లాడుతూ లైంగిక సేవల కొనుగోలును నేరంగా పరిగణించిన సందర్భంలో స్వీడన్ తదితర ఐరోపా దేశాల్లో సత్ఫలితాలు రాలేదన్నారు. లైంగిక సేవలను కొనుగోలు చేసేవారిని శిక్షించే కంటే మానవ అక్రమ రవాణాని నిరోధించి సెక్స్ వర్కర్ల సమగ్ర పునరావాసానికి చక్కని వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర వహిస్తున్నాయని కితాబిచ్చారు.

సెక్స్ వర్కర్ల...అభిప్రాయాలు
ఈ సమావేశానికి హాజరైన ఒక సెక్స్ వర్కర్ తన అనుభవాలను పంచుకుంటూ తాము దైనందిక జీవితంలో అడుగడుగునా వివక్ష, వెలివేతను ఎదుర్కొంటున్నామని చెప్పారు. సరికొత్త జీవితం ప్రారంభించాలంటే సాధారణ ప్రజలే కాకుండా పోలీసులు కూడా అడ్డుగోడలుగా నిలుస్తున్నారని ఆమె వాపోయారు. సెక్స్ వర్కర్లు గౌరవ జీవితాన్ని ప్రారంభించేందుకు తోడ్పడేలా ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, పోలీసులను చైతన్యపరచాలన్నారు. మరో సెక్స్ వర్కర్ మాట్లాడుతూ తమ కుమార్తెలు తిరిగి వ్యభిచార ఊబిలోకి రాకుండా ఉండేందుకు కష్టపడి చదివిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications