ముందస్తు అప్పుడే ? చంద్రబాబు-పవన్ క్లియర్-వైసీపీకి దీటుగా జిల్లాల్లో టూర్లకు సన్నాహాలు
ఏపీలో ముందస్తు ఎన్నికలపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా విపక్షాలు మాత్రం సన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని భావిస్తున్న విపక్షాలు.. ఈ మేరకు వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి. గతంలో వైసీపీ నేత సజ్జల ఏడాది లేదా రెండేళ్లలో జరిగే ఎన్నికలంటూ ఇచ్చిన లీక్ తో అధికార పార్టీ కూడా ముందస్తుకు రెడీ అవుతున్న సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు గడపగడపకూ తిరుగుతూ హంగామా చేస్తున్న వైసీపీని అడ్డుకోవాలంటే జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారు.

ఏపీలో ముందస్తు కూత
ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమైపోతున్నాయి. రెండేళ్ల తర్వాత జరగాల్సిన ఎన్నికలకు వైసీపీ పూరించిన సమరశంఖంతో ప్రత్యర్ధి పార్టీలైన టీడీపీ, జనసేన కూడా అప్రమత్తమైపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ క్యాడర్ కు నిత్యం సంకేతాలు పంపుతున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత జోరందుకుంటున్నాయి.

చంద్రబాబు జిల్లాల టూర్
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఓడించి తీరాల్సిందేనని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ ముూడేళ్లలో వైసీపీ చేతిలో ఎదుర్కొన్న అవమానాలు, దాడులు, కేసులతో టీడీపీతో పట్టుదల మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని చంద్రబాబు తన క్యాడర్ కు ఏడాది కాలంగా సూచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతుండటంతో జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి ఆయన జిల్లాల టూర్ కు శ్రీకారం చుడుతున్నారు.

పవన్ బస్సుయాత్ర
వాస్తవంగా ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నా అధికార వైసీపీ చేస్తున్న హడావిడితో జనసేన అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లాల టూర్ కు సిద్ధమవుతున్నారు. దసరా నుంచి జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టాలని జనసేనాని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా పవన్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే పొత్తులు ఉన్నా లేకపోయినా ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో పవన్ ముందుకు కదులుతున్నారు.












Click it and Unblock the Notifications