సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ, ఆదేశాలు..!!
సీఎం చంద్రబాబు కేసుపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ జరపాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది. పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్, స్కిల్ కేసును సీబీఐకు అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిల్‌పై హైకోర్టు విచారించింది. ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఆయా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పట్టిక రూపంలో తమకు ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచన చేస్తూ విచారణ వాయిదా వేసింది.
సీఎం చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐ కు అప్పగించాలనే పిటీషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సీఎంను, ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయాలని సీబీఐ దర్యాప్తును కోరుతున్నారని రోహత్గీ కోర్టు ముందు పేర్కొన్నారు. కనీస ఆధారాలు లేకుండా ప్రజాహిత వ్యాజ్యం వేశారని తెలి పారు. తాము విచారించదగిన కేసులు కావని సీబీఐ, ఈడీ అఫిడవిట్లు వేశాయని ప్రస్తావించారు. ఆధారాలు లేవంటూ సిట్ ఏసీబీ కోర్టులో తుది నివేదిక జారీ చేసిందని పేర్కొన్నారు. వాటిని ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు కేసులను మూసివేసిందని వివరించారు. ఈ పిల్‌ను నిరర్ధకమైనదిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని ముకుల్ రోహత్గీ కోరారు. ఖర్చులు విధించి ఈ పిల్‌ను కొట్టివేయా లని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
అదే విధంగా చంద్రబాబు తదితరులపై నమోదైన ఏడు కేసులలో తిలక్ ఫిర్యాదుదారుడు కాదన్నారు. ఏడు కేసులను ఏసీబీ కోర్టు మూసివేయగా అందులో ఒక కేసులో మాత్రమే ఫిర్యాదు దారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. కేసుల మూసివేత పై ఇతర ఫిర్యాదుదారులు అభ్యంతరం చెప్పలేదని వివరించారు. ఆయా కేసులలో తగిన ఆధారాలు లేవంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ తుది నివేదికలను(ఫైనల్ రిపోర్టు) దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చిందని తన వాదనల్లో స్పష్టం చేసారు. దీంతో, సంబంధిత కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో తమకు ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తిరిగి కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications
